సీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు
● ఈ నెల 19న అన్ని పార్టీలు,ప్రజాసంఘాలతో సమావేశం
● వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ పాకా సురేష్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీరు రావాలంటే శ్రీశైలం ప్రాజెక్టే ఆధారమని చెప్పారు. గతంలో వరద రోజులు 130 ఉండేవని, రానురాను పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. కృష్ణా జలాల్లో రాయలసీమ వాటాను సక్రమంగా ఉపయోగించుకునేందుకు 11 వేల క్యూసెక్కులున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 44 వేల క్యూసెక్కులకు పెంచారని చెప్పారు. అప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణ నేతలతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. శ్రీశైలంలో 841 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఆ నీటిని వాడుకునేందుకు వీలుంటుందని, ఆలోపే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు వదులుతోందని చెప్పారు. తెలంగాణ 800 అడుగుల్లో పాలమూరు–రంగారెడ్డి, 802 అడుగుల్లో కల్వకుర్తి వంటి అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తోడుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో 800 అడుగుల్లోనే రాయలసీమకు నీటిని తోడుకునేందుకు వీలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టి, 70 శాతం పనులు కూడా పూర్తి చేశారని చెప్పారు. రాయలసీమకు కేటాయించిన 101 టీఎంసీల నీటిని సక్రమంగా వాడుకోవాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశఽం జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు కడపలోని బీసీ భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమకు చెందిన మేధావులు, ప్రజా సంఘాల నేతలు ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి పాల్గొన్నారు.


