పండగ పూట.. వారి ఇంట విషాదం
● ఒకే రోజు తాతమనవళ్లు మృతి
● అంత్యక్రియల్లో పాల్గొన్న సతీష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి
చక్రాయపేట : సంక్రాంతి పండుగ పూట.. ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఒకరు అనుమానాస్పదంతో మరొకరు అనారోగ్యంతో మృతి చెందారు. ఇద్దరి అంత్యక్రియలు బుధవారం భోగి పండుగ నాడు జరిగాయి. వారిద్దరూ దగ్గరి బంధువులు(వరుసకు తాతా మనవళ్లు) కావడంతో గండికొవ్వూరు గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగింది. వివరాల్లోకి వెళితే.. గండికొవ్వూరు గ్రామ సర్పంచ్ మోపూరి కిరణ్‌కుమార్‌రెడ్డి(33) మంగళవారం (గుండెపోటు అని కొందరు, గాయాల ఉన్నందున అనుమానం ఉందని మరికొందరు) చనిపోయిన విషయం తెలిసిందే. మరొకరు అదే గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డిగారి రాజగోపాల్‌రెడ్డి(70). ఈయన సర్పంచ్ కిరణ్‌కు తాత. ఈయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. కిరణ్ చనిపోయాడని తెలియగానే మరింత ఉద్విగ్నానికి గురయ్యాడు. కుటుంబీకులు కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో కుటుంబీకులు రాజగోపాల్‌రెడ్డి మృతదేహానికి ఉదయం 11 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన అంత్యక్రియలు పూర్తయ్యాక కిరణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. బంధుమిత్రులు పెద్ద ఎత్తున గండి కొవ్వూరుకు తరలివచ్చి వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కాగా మృతులు ఇద్దరూ వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులే.
అంత్యక్రియల్లో పాల్గొన్న సతీష్‌రెడ్డి,
కొండారెడ్డి
గండికొవ్వూరు గ్రామ సర్పంచ్ మోపూరి కిరణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి (అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్) చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్ కొడారెడ్డి పాల్గొన్నారు. కిరణ్ చనిపోయిన విషయం తెలుసుకున్న వారు గండి కొవ్వూరుకు వచ్చి ఆయన మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. అంత్య క్రియల్లో వైఎస్‌ఆర్‌సీపీ, తెదేపా, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


