అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
కడప అర్బన్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఈ తరం వారికి గుర్తు చేస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం ఉదయం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీసమేతంగా ముఖ్య అతిథిగా హాజరై సంబరాలను ప్రారంభించారు. అంతకుముందు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పోలీస్ అధికారులు అందంగా ముస్తాబు చేశారు. భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, గాలిపటాల హోరు, ఎడ్ల బళ్ల చప్పుడు, సంప్రదాయ పిండి వంటలు ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేశాయి. ఎస్పీ భోగి మంటను వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ యూనిఫాంలో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది ఆటవిడుపుగా సంప్రదాయ దుస్తులలో తళుక్కున మెరిశారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసు అధికారులు అంతా తమ కుటుంబసభ్యులతో కలిసి ఒక్క చోటకు చేరి కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులు అందజేశారు.
పోలీసులంతా ఒక కుటుంబంగా
జరుపుకోవాలనే ఆకాంక్షతో..
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు ఒక ప్రత్యేకత ఉందని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలూ బిజీగా ఉండే పోలీసులు తమ కుటుంబ సభ్యులతో ఒక్క రోజైనా సంతోషంగా ఉండాలని, ఒక కుటుంబంగా పోలీసులు సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలనే తలంపుతో వేడుకలు జరుపుకొంటున్నామన్నారు. నూతన సంవత్సరంలో పోలీస్ శాఖ నూతనోత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ యు.సదాశివయ్య, డి.సి.ఆర్.బి సీఐ ఈశ్వర్‌రెడ్డి, కడప నగర సీఐలు చిన్న పెద్దయ్య, ప్రసాద రావు, ఓబులేసు, ఎల్లమరాజు, రెడ్డెప్ప, బాలమద్దిలేటి, రామకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు శివరాముడు, శ్రీశైలరెడ్డి, సోమశేఖర్ నాయక్, కడప సబ్ డివిజన్‌లోని సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు స్వామి నాయక్, వెంకటేశ్వర్లు, చూడామణి, శ్రీనాథ్, మహిళా ఆర్‌ఎస్‌ఐ పావని, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్, డీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు


