శాస్త్రోక్తంగా అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో జాంబవంతుడు ప్రతిష్టించిన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తొలుత ఉత్సవ నిర్వాహకుడు రాజేష్‌భట్టర్‌ను సంప్రదాయబద్ధంగా ఆలయంలోకి తీసుకువచ్చారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కోలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. రాత్రి 6 నుంచి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ రంగ మండపంలో ఉత్సవ మూర్తులకు బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు తొడిగి, తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకుడు రాజేష్‌భట్టర్ ఉత్సవ మూర్తులకు అంకురార్పణ పూజలు నిర్వహించి, ఆలయంలోని పవిత్ర పుట్టమన్నును యాగశాలలో ప్రతిష్టించారు.
నేడు ధ్వజారోహణం
ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:15 గంటల మద్య వృషభలగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుంచి 9 వరకు శేషవాహన సేవ ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ అర్చకులు, పండితులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.


