సీతారాముల అనుగ్రహం అందరికీ ఉండాలి
– ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంటిమిట్టలో జరగబోయే సీతారామ కళ్యాణం వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా శ్రీరామనవమి పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు.
జువైనల్ జస్టిస్ బోర్డు
సభ్యులుగా డాక్టర్ లలిత
కడప ఎడ్యుకేషన్ : జువైనల్ జస్టిస్ బోర్డ్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా వైవీయూ సైకాలజీ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె.లలిత ఎంపికయ్యారు. కమిటీ చైర్ పర్సన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు, ఇతర సభ్యులు ఉన్నారు. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల నుండి ప్రొఫెసర్ వి.లలిత కుమారి (సోషియల్ వర్కర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి), బి పద్మావతి(మెంబర్ ,కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్)ను సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది.
పొడదుప్పిపై మానవత్వం
కలసపాడు : మండలంలోని సింగరాయపల్లె గ్రామంలో పొడదుప్పిని కుక్కల దాడి నుంచి కాపాడి గ్రామస్థులు మానవత్వం చాటారు. అడవి నుండి పొడ దుప్పి గ్రామంలోకి వచ్చింది. కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా గమనించిన సింగరాయపల్లె గ్రామస్తులు అడ్డుకుని పొడ దుప్పిని ఒక ఇంటిలో ఉంచారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ అధికారి రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె సెక్షన్ అధికారి రమణయ్య, మామిళ్లపల్లె బీట్ అధికారి భారతి, డాగ్ స్క్వాడ్ అధికారి హసన్, గురయ్య, ప్రొడక్షన్ ఫోర్స్ సిబ్బంది చేరుకుని పొడదుప్పిని పరిశీలించారు. అనంతరం గ్రామస్థుల సాయంతో అటవీ వాహనంలో తీసుకెళ్ళి తడుకుచెరువు సమీపాన అడవిలో వదిలారు.
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
మదనపల్లె : షట్టర్లు తొలగించి దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అంతర్ జిల్లా దొంగల అరెస్టు వివరాలను శనివారం మీడియాకు ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన గుజిరీ వ్యాపారి మాదిగజార్జి(26), అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం భైరవగుట్టకు చెందిన బండపల్లిరెడ్డిశేఖర్(23) ముఠాగా ఏర్పడ్డారు. అన్నమయ్య జిల్లా కురబలకోట, మదనపల్లె, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో దుకాణాల షట్టర్లు తొలగించి దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు క్రైమ్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టామన్నారు. సాంకేతికతను ఉపయోగించి నిందితులకు సంబంధించిన పక్కా సమాచారం తెలుసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ఉదయం కురబలకోట మండలం కడప–మదనపల్లె రోడ్డులోని కడప క్రాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి కురబలకోట, గుర్రంకొండ, మదనపల్లె, చిత్తూరు, ఆదోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించిన వస్తువులు...సోనీ టీవీ, ల్యాప్‌టాప్, 50 కిలోల కాపర్‌వైర్, మూడు ట్యాబ్‌లు, ఒక టేబుల్ ఫ్యాన్, సిగరెట్లు, ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ కనపరిచిన సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్, స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ డి.కొండయ్యనాయుడు అభినందించారు.
సీతారాముల అనుగ్రహం అందరికీ ఉండాలి
సీతారాముల అనుగ్రహం అందరికీ ఉండాలి


