
బడి బస్.. ఫిట్‌నెస్
● జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద బడి బస్సుల తనిఖీ
● కండిషన్‌లో లేకుంటే అనుమతి నిరాకరణ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లాలో పాఠశాలలు త్వరలోనే పునః ప్రారంభం కానున్నాయి. బడి బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణించే స్కూల్ కళాశాల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. పరీక్షల్లో తప్పనిసరిగా బస్సులు కండిషన్‌లో ఉన్నట్లు రుజువు కావాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు.. సిబ్బంది ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
● జిల్లాలో బడి బస్సులు ఆరువందల వరకు ఉన్నా యి వీటిలో ప్రతిరోజు 20 నుంచి 30 బస్సుల కండిషన్ అధికారులు పరీక్షిస్తున్నారు వాహనంలో లోటుపాటు కనిపిస్తే వెంటనే వెనక్కి పంపిస్తున్నారు. ఆ లోపాలను సరిదిద్దే వరకు సర్టిఫికెట్ జారీ చేయడం లేదు.
పరీక్షలు ఇలా.....
● స్కూల్ బస్సును మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ స్వయంగా డ్రైవ్ చేస్తారు
● మరమ్మతులు ఏమైనా ఉన్నాయా అని గుర్తిస్తారు.
● బ్రేకులు, క్లచ్ స్టీరింగ్, హ్యాండ్ బ్రేక్, బ్యాటరీ, ఇంజిన్‌కు సంబంధించి పలు విభాగాలను పరిశీలిస్తారు.
● అత్యవసర ద్వారాలు, కిటికీలు, టైర్లు, సీట్లను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
నిబంధనలు ఇలా.....
● డ్రైవర్ కు 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఐదేళ్లు అనుభవంతో పాటు భారీ వాహన లైసెన్స్ తప్పనిసరి.
● శారీరక దారుఢ్యంతోపాటు ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి
● డ్రైవర్ సహాయకుడు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. వేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడపరాదు.
● బస్సులో ప్రథమ చికిత్స బాక్స్ ఉండాలి
● విద్యార్థులు బస్సు ఎక్కేందుకు రెండు వైపులా ఇనప కడ్డీలు ఉండాలి. వాహనం ముందు భాగంలో పాఠశాల పేరు, ఫోన్ నంబర్ తప్పనిసరి.
కండిషన్లో లేకుంటే చర్యలు
స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అన్ని సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును రోడ్డుపై తిరగనివ్వం. ఫిట్‌నెస్ పరీక్ష చేయించకుండా బస్సు నడిపితే కేసులు నమోదు చేస్తాం. లైసెన్స్ ఉన్న డ్రైవర్ తోనే వాహనాన్ని నడిపించాలి. –మీరా ప్రసాద్,
జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్

బడి బస్.. ఫిట్‌నెస్