సాక్షి, యాదాద్రి : భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే, భూముల నక్షా తదితర అంశాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీ లో కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డు అధికారి సుజాత పాల్గొన్నారు.
నేడు విద్యా సంస్థల బంద్
భువనగిరి: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్వహించే విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డీ. సలీం గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల విలీనం, మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పెండింగ్‌లోఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ సదస్సులో ఉప కమిషనర్ సరిత, జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.
డిప్యూటీ ఈఓ
బాధ్యతల స్వీకరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో డిప్యూటీ ఈఓగా దోర్భాల భాస్కర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. యాదగిరి దేవస్థానం డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహించిన నవీన్ కుమార్ వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో డిప్యూటీ ఈఓగా పనిచేసిన భాస్కర్ శర్మ వచ్చారు. ఈ ఏడాది మార్చి 30న వేములవాడ శ్రీరాజరాజేశ్వరి దేవస్థానానికి వర్కింగ్ అరెంజ్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ ఈఓ హోదాలో దోర్భాల భాస్కరశర్మ బదిలీపై వెళ్లారు. డిప్యూటీ ఈఓ నవీన్ కుమార్‌ను దేవాదాయశాఖ అధికారులు రాజరాజేశ్వరి దేవస్థానానికి బదిలీ చేయడంతో తిరిగి ఆ స్థానంలో భాస్కర్ శర్మ బాధ్యతలు తీసుకున్నారు.


