సాక్షి, యాదాద్రి, భువనగిరి: జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలు, పట్టణాల పరిధిలో ఖాళీగా ఉన్న 90 రేషన్ దుకాణాల డీలర్ల నియామకం కోసం అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 60 ఖాళీలు, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 30 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఏయే స్థానాలు ఏ రిజర్వేషన్లకు కేటాయించారో నోటిఫికేషన్‌లో స్పష్టంగా ప్రకటించారు.
అర్హతలు, నిబంధనలు
ఫ అభ్యర్థులు కనీసం 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి అర్హత కలిగిన వారు లభించని పక్షంలో మాత్రమే 7వ తరగతి పాసైన వారి దరఖాస్తులను పరిశీలిస్తారు.
ఫ నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండి, 40 ఏళ్లు మించకూడదు.
ఫ నిరుద్యోగులు, మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) అర్హులు.
ఫ అభ్యర్థులు ఏ చౌక ధరల దుకాణానికి దరఖాస్తు చేసుకుంటున్నారో, తప్పనిసరిగా ఆ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలోనే నివాసి అయి ఉండాలి. దివ్యాంగ అభ్యర్థులైతే సంబంధిత మండల నివాసి అయి ఉండి, ఎంపికై న తర్వాత సదరు గ్రామంలోనే నివసించాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత మాత్రం గ్రామ నివాసికే ఇస్తారు.
ఫ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, మహిళా గ్రూపులకు (ఎస్‌హెచ్‌జీ) ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
ఫ దరఖాస్తుదారులపై ఎలాంటి నేర చరిత్రగానీ, నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు గానీ ఉండకూడదు.
13 నుంచి దరఖాస్తుల స్వీకరణ
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 13వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 27ను ఆఖరు తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో దరఖాస్తులను స్వీకరించరు.
ఫ భువనగిరి డివిజన్‌లో 60,
చౌటుప్పల్‌లో 30 పోస్టులు
ఫ 13 నుంచి 27 వరకు
దరఖాస్తుల స్వీకరణ


