పాత భవనాల రీ–మోడలింగ్ ఇబ్బందే..
నిర్దేశించిన గడువులోగా ఎయిమ్స్ పూర్తి కావాల్సిందే : కేంద్ర మంత్రి నడ్డా
సాక్షి, యాదాద్రి : బీబీనగర్ ఎయిమ్స్ పనులన్నీ ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు. గురువారం ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఎయిమ్స్ ప్రగతిపై ఎంపీలు, ఎయిమ్స్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్ ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ చాలా పట్టుదలగా ఉన్నారని, ఇప్పటి వరకు సుమారు 85శాతం పనులు పూర్తయ్యాయని అయితే పనుల్లో జాప్యం అవుతోందని, ఇప్పటికే రెండుసార్లు డెడ్‌లైన్ పొడిగించామని, మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. పనుల పురోగతి పర్యవేక్షణకు ప్రతి రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక సెక్రటరీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో కేవలం 100 నుంచి 150 పడకలతోనే సేవలు అందుతున్నాయని,బడ్జెట్ పరంగా , వైద్య పరికరాల కొనుగోలు పరంగా ఎలాంటి కొరత లేదని, భవన నిర్మాణాలు పూర్తి కాక అధునాతన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అమర్చలేకపోతున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు.
ఎయిమ్స్‌లో పూర్తి స్థాయి
వైద్యం అందించాలని వినతి
ఎయిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్యం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఊట్కూరి అశోక్‌గౌడ్, చందా మహేందర్‌గుప్తాలు .. కేంద్రమంత్రి జేపీ నడ్డాకు వినతిపత్రం అందజేశారు.
జారి కిందపడిన పలువురికి గాయాలు
ఎయిమ్స్ అకడమిక్ భవన్‌లోకి వస్తున్న పలువురు జారి కిందపడి గాయాలపాలయ్యారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ పక్కన టైల్స్‌పై ఉప్పు కలిపిన రంగులు అందంగా అలంకరించారు. వీటిపైఅడుగు వేసిన వెంటనే సెక్యూరిటీ అధికారులు, కెమెరామెన్‌లు, జర్నలిస్టులు, బీజేపీ నాయకులు కిందపడ్డారు. ఓ టీవీ కెమెరామన్ కెమెరా కిందపడి పగిలిపోయింది.
అందని అత్యవసర వైద్యం
కేంద్ర మంత్రి నడ్డా అత్యవసర విభాగాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా అక్కడికి అత్యవసర వైద్యం కోసం వచ్చి రోగి నిరీక్షించాల్సి వచ్చింది.
ఫ బీబీనగర్ ఎయిమ్స్‌పై ప్రధాని
పట్టుదలగా ఉన్నారు
ఫ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులపై
సీఎంతో మాట్లాడుతా
ఫ ఎంపీలు, అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
ఎయిమ్స్ పాత భవన సముదాయంలో ప్రారంభం కావడం వల్ల, వాటిని ఎయిమ్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం ఇబ్బందిగా మారిందని సమావేశంలో చర్చకు వచ్చింది. కార్డియాలజీ వంటి కొన్ని విభాగాల్లో తగిన స్థలం లేకపోవడం, నెఫ్రాలజీ విభాగంలో తగినన్ని డయాలసిస్ మిషన్లు లేకపోవడం వంటి సమస్యలను కూడా త్వరలోనే అధిగమిస్తామని అధికారులు మంత్రికి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ విజ్‌యనేత్ర, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు.


