ఫైళ్లన్నీ పెన్‌డ్రైవ్‌లోనే.. | - | Sakshi
Sakshi News home page

ఫైళ్లన్నీ పెన్‌డ్రైవ్‌లోనే..

Apr 21 2026 3:44 AM | Updated on Apr 21 2026 3:44 AM

పాలనలో మరింత వేగం

సాక్షి, యాదాద్రి : దుమ్ముపట్టిన ఫైళ్లు.. పేపర్ల కుప్పలు.. పాలనలో జాప్యం.. ఈ పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని టోకెన్‌ నంబర్లు, డిజిటల్‌ సంతకాలతో కూడిన సరికొత్త పాలనా వ్యవస్థకు కలెక్టరేట్‌లో శ్రీకారం చుట్టునున్నారు. పనుల్లో పారదర్శకత, వేగం పెంచే లక్ష్యంతో వచ్చే నెల 1వ తేదీ నుంచి డిజిటల్‌ ఫైలింగ్‌ విధానాన్ని అమలు చేయబోతున్నారు.

టోకెన్‌ నంబర్లే అధికారుల గుర్తింపు

ఈ కొత్త విధానం కోసం కలెక్టరేట్‌లోని ప్రతి విభాగం, ప్రతి అధికారికి ఒక ప్రత్యేకమైన టోకెన్‌ నంబర్‌ కేటాయించారు. ఈ నంబర్లతో కూడిన ప్రత్యేక పెన్‌ డ్రైవ్‌లను ఇప్పటికే పంపిణీ చేశారు. గతంలో ఒక సెక్షన్‌ నుంచి మరో సెక్షన్‌కు భౌతికంగా ఫెళ్లు వెళ్లేవి. ఇకపై ఆ అవసరం లేకుండా, సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో పెన్‌ డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి పంపిస్తారు.

ప్రక్రియ సాగుతుందిలా..

వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న ఈ ప్రక్రియలో అధికారులు మూడు దశల్లో పని చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి నుంచి వచ్చే దరఖాస్తులు లేదా నివేదికలను కంప్యూటరీకరించి పెన్‌ డ్రైవ్‌లో భద్రపరుస్తారు. పెన్‌ డ్రైవ్‌ అందుకున్న అధికారి తన కంప్యూటర్‌లో ఫైల్‌ను తనిఖీ చేస్తారు. పెన్నుతో సంతకం చేసే అవసరం లేకుండా, వారికి కేటాయించిన డిజి టల్‌ సిగ్నేచర్‌ ద్వారా ఆమోద ముద్ర వేస్తారు. సెక్షన్‌ ఆఫీసర్‌ నుంచి అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌ వరకు ఇదే పద్ధతిలో పెన్‌ డ్రైవ్‌ల ద్వారా ఫైళ్లు బదిలీ అవుతాయి.

శిక్షణ పూర్తి.. ఇక అమలుపై దృష్టి

ఈ నూతన విధానంపై ఇప్పటికే కలెక్టరేట్‌ సిబ్బందికి, వివిధ శాఖల అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాఫ్ట్‌వేర్‌ పకడ్బందీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కలెక్టరేట్‌లో డిజిటల్‌ విధానంలో మరో ముందడుగు

ఫ పారదర్శకత, వేగవంతమైన పాలనకు డిజిటల్‌ఫైలింగ్‌ సిస్టమ్‌

ఫ అధికారులకు టోకెన్‌ నంబర్లు, డిజిటల్‌ సంతకాల కేటాయింపు

ఫ వచ్చేనెల 1 నుంచి అమలు

ఈ డిజిటల్‌ సంస్కరణల వల్ల ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉంటాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఫైళ్లు ఒక టేబుల్‌ నుంచి మరో టేబుల్‌కు వెళ్లడానికి పట్టే సమయం ఆదా అవుతుంది. ఫలితంగా ప్రజలకు అందే సేవలు వేగవంతమవుతాయి. ఏ అధికారి వద్ద ఫైల్‌ ఎంత సమయం ఆగిందో డిజిటల్‌ లాగ్స్‌ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. దీనివల్ల పనిలో జాప్యం తగ్గుతుంది. ఏటా వేల సంఖ్యలో వినియోగించే కాగితాల వినియోగం తగ్గి, కార్యాలయాలు పరిశుభ్రంగా మారుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement