అర్ధరాత్రి ఆపదొస్తే.. అల్లాడాల్సిందే!
పీహెచ్‌సీల్లో రాత్రి వేళ అందుబాటులో ఉండని వైద్యులు
● ఆత్మకూర్ పీహెచ్‌సీలో 24 గంటల వైద్యం అందించాలి. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉండాలి. కాని ఒక్కరే డాక్టర్ ఉన్నారు. మరో డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇద్దరు వైద్య సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అందులో హెల్త్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో ఉన్నారు. పోసానికుంట వద్ద తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మోత్కూరు చెందిన రామకృష్ణ తలకు గాయమై చికిత్స కోసం పీహెచ్‌సీకీ తీసుకువచ్చారు. అక్కడ ఉన్న హెల్త్ అసిస్టెంట్ ప్రాథమిక వైద్యం చేసి భువనగిరికి రిఫర్ చేశారు.
ఫ కింది స్థాయి సిబ్బందికి డ్యూటీ వేసి వెళ్లిపోతున్న డాక్టర్లు
ఫ అత్యవసర వైద్యం కోసం ప్రైవేట్‌కు పరుగులు తీస్తున్న రోగులు
ఫ 24 గంటల వైద్యం ఉత్తిమాటే
ఫ కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
సాక్షి, యాదాద్రి: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పరిఽధిలో 24 గంటల వైద్యం మొక్కుబడిగా మారింది. రాత్రి సమయంలో పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇద్దరు వైద్యులు షిఫ్టుల వారీగా వైద్యం అందించాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందికి డ్యూటీ వేసి డాక్టర్లు వెళ్లిపోతున్నారు. దీంతో అర్ధరాత్రి అత్యవసర వైద్యం కోసం రోగులు ఆస్పత్రికి వెళ్తే పట్టించుకునే డాక్టర్లు కరువయ్యారు. శనివారం రాత్రి 8 గంటల అనంతరం 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన పీహెచ్‌సీలను విజిట్ చేయగా.. పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
అత్యవసర సేవలకు అందుబాటులో
ఉండాల్సి ఉన్నా..
యాదగిరిగుట్ట, ఆత్మకూర్ (ఎం), నారాయణపూర్, రాజాపేట, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, మోత్కూరు, తుర్కపల్లి, బొమ్మలరామారం పీహెచ్‌సీలు 24 గంటల వైద్యం అందించాలి. వీటిల్లో మొత్తం 14 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండాలి. ఇందులో ఒక మహిళా డాక్టర్ లేదా ఆయూష్ డాక్టర్ ఉంటారు. అత్యవసర సేవలకు డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. స్టాఫ్ నర్సులు, నర్స్– మిడ్ వైప్‌లు ముగ్గురు ఉండాలి. వీరితోపాటు ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్ సిబ్బంది ఉండాలి. కాని ఎక్కడా అందుబాటులో ఉండడం లేదు.
● తుర్కపల్లి పీహెచ్‌సీలో శనివారం రాత్రి 8 గంటలకు విజిట్ చేయగా ఒక ఏఎన్‌ఎం మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇక్కడ ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లలో ఒకరు రాజాపేట పీహెచ్‌సీకి డిప్యూటేషన్‌పై వెళ్లారు. మరో డాక్టర్ సాయంత్రం విధులను పూర్తి చేసుకుని వెళ్లారు. అత్యవసర వైద్యం కోసం ఎవరైన రాత్రివేళ వస్తే వారికి వైద్యం అందదు. ఇటీవల గర్భిణి కడుపు నొప్పితో రాత్రి వేళ వస్తే వైద్యం చేసే డాక్టర్ లేక భువనగిరికి తరలించారు.
● వలిగొండ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలోనూ రాత్రి 8 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ హల్లోపతి, ఆయుర్వేదం డాక్టర్లు ఇద్దరు ఉండాలి. కానీ సాయంత్రం తర్వాత ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ప్రస్తుతం సిస్టర్, ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు. అత్యవసర వైద్యం కోసం రోగులను భువనగిరికి పంపిస్తున్నారు. కోతులు లోపలికి వస్తాయన్న భయంతో ఐరన్ గ్రిల్స్‌తో ఆస్పత్రి మూసి వేశారు.
అర్ధరాత్రి ఆపదొస్తే.. అల్లాడాల్సిందే!
అర్ధరాత్రి ఆపదొస్తే.. అల్లాడాల్సిందే!


