కేసులు పెండింగ్ లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : జిల్లాలో కేసులు పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. శనివారం జిల్లా కోర్టు భవనంలో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం అంశాలపై చర్చించి, త్వరితగతిన కేసుల పరిష్కారం, పెండింగ్ జాప్యాన్ని తగ్గించటం, జైలులో ఉన్న వారి కేసులు పరిష్కారం, న్యాయ సహాయం, సాక్షి రక్షణ పథకం వంటి అంశాలపై చర్చించి తగిన సూచనలు చేశారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవి లత, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రూ పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
భువనగిరి: పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అఽధిరోహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. శనివారం భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల లింగబసవ గార్డెన్స్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ విద్యార్థులకు ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఏకాగ్రతతో చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పరీక్షల మధ్య ఉన్న విరామ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల్లో పరీక్షా భయం లేకుండా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి సాహితి, డీఈఓ సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
బొమ్మలరామారం: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బొమ్మలరామారం మండలంలోని యువ డిఫెన్స్ అకాడమీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను శనివారం పరిశీలించారు. కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన గాలి, వెలుతురు ఉండేలా, తాగు నీరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పనులు త్వరగా పూర్తిచేయాలి
భువనగిరిటౌన్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు పురోగతిపై పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ వేతనాలు, మెటీరియల్ చెల్లింపుల లక్ష్యాలను సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల
ఆకాంక్షలు నెరవేర్చాలి
భువనగిరిటౌన్ : గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ అన్నారు. శనివారం భువనగిరిలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ.30 వేల పెన్షన్, హెల్త్‌కార్డులు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు, ముష్కె జయపాల్‌రెడ్డి, మంతపురం వినోద్, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, మాణిక్యమ్మ, బేజాడి కుమార్, కృష్ణ, లక్ష్మణ్, గణేష్, పాండు పాల్గొన్నారు.


