వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి శ్రీలక్ష్మీ దేవితో నారసింహుని కల్యాణోత్సవంలో భాగంగా పెళ్లిచూపుల తతంగాన్ని నిర్వహించారు. రాత్రి 8 గంటలకు అశ్వవాహనంపై స్వామిని, ముత్యాల పల్లకీపై అమ్మవారిని అలంకరించి ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పు రాజగోపురం ముందు గల మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టి, అమ్మవారిని తూర్పు ముఖంగా అధిష్ఠించారు. కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు బుధవారం రాత్రి 9.45గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందని.. సరిగ్గా సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారిని పరిణయమాడుతారని వెల్లడించారు.
జగన్మోహిని అలంకారంలో స్వామివారు..
మంగళవారం ఉదయం జగన్మోహిని అవతారంలో స్వామివారిని అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు హోమాది పూజలు, పారాయణాలు నిర్వహించారు.
ఆలయంలో నేడు..
బుధవారం ఉదయం 10గంటలకు శ్రీరామ అలంకారం, హనుమంత సేవ, అదేవిధంగా రాత్రి గజవాహన సేవ, 9.45గంటలకు తిరుకల్యాణోత్సవం జరిపించనున్నారు.
జగన్మోహిని అలంకారంలో
యాదగిరీశుడి దర్శనం
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం


