నేడు నృసింహుడి కల్యాణం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి జరగనుంది. రాత్రి 9గంటలకు గజ వాహనంపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాడ వీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడ వీధిలోని కల్యాణ వేదికకు చేరుకుంటారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణికులు కల్యాణ వేడుకను ప్రారంభిస్తారు. సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారికి మాంగళ్యధారణ చేస్తారు. ఈ కల్యాణోత్సవానికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర మాడ వీధిలోని కల్యాణ మండపాన్ని పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులు, వీఐపీలు కల్యాణాన్ని తిలకించేలా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో, బస్టాండ్ ఏరియాలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో కల్యాణం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కల్యాణోత్సవానికి గవర్నర్, మంత్రులు..
కల్యాణోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పలువురు ఐఏఎస్ అధికారులు రానున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్వామివారి కల్యాణానికి వచ్చే అవకాశాలున్నాయని, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదని ఆలయాధికారులు పేర్కొన్నారు.


