మిర్యాలగూడలో ఘర్షణలు | - | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో ఘర్షణలు

Feb 12 2026 11:34 AM | Updated on Feb 12 2026 11:34 AM

మిర్యాలగూడలో ఘర్షణలు

మిర్యాలగూడలో ఘర్షణలు

కాంగ్రెస్‌ పతనం మొదలైంది

మిర్యాలగూడ అర్బన్‌ : మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కొన్ని వార్డులు రణరంగాన్ని తలపించాయి. 29వార్డు బంగారుగడ్డలో బీఆర్‌ఎస్‌ బలపర్చిన సీపీఎం అభ్యర్థి డబ్బికార్‌ మల్లేష్‌ తరఫున షేక్‌ మస్తాన్‌న్‌, షేక్‌ జమీన్‌, షేక్‌ బడేమియా పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన వారిపై కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ జావెద్‌, అతడి సోదరులు అనుచరులతో కలిసి ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేశారు. దీంతో మస్తాన్‌ తలకు గాయమై స్పృహ కోల్పోయాడు జమీన్‌, బడేమియాకు గాయాలయ్యాయి. ముగ్గురిని స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తనయుడు నల్లమోతు సిద్దార్ధ చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించేందుకు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో జావెద్‌ అనుచరులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పరామర్శిస్తున్న నల్లమోతు సిద్దార్ధపై కూడా దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మస్తాన్‌, జమీన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

మరో మూడు వార్డుల్లో ఘర్షణలు..

అదేవిధంగా 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ, 32వ వార్డు బంగారుగడ్డలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. 20వ వార్డు రెడ్డీకాలనీలో బీఆర్‌ఎస్‌ పోలింగ్‌ ఏజెంటుగా కూర్చున్న అశోక్‌పై ఆ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి భర్త దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముందుగానే ఫిర్యాదు చేశాం..

29వ వార్డులో ఘర్షణలు జరిగే ఆస్కారం ఉందని డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తాను ముందుగానే ఫిర్యాదు చేశానని సీపీఎం అభ్యర్ధి డబ్బికార్‌ మల్లేష్‌ తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న జావెద్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయని, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నానని, తన ఫిర్యాదుపై స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడులు జరిగేవి కావని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకుని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పరామర్శించారు. కాంగ్రెస్‌ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ 29వ వార్డులో బీఆర్‌ఎస్‌ పోలింగ్‌ ఏజెంట్లపై కాంగ్రెస్‌ వర్గీయుల దాడి

ఫ పోలీసుల లాఠీచార్జి

ఫ ముగ్గురికి గాయాలు

ఫ మరికొన్ని వార్డుల్లో

చెదురుమదురు ఘటనలు

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

నల్లగొండ టూటౌన్‌ : కాంగ్రెస్‌ పార్టీ పతనం మొదలైందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న భౌతిక దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్‌ కార్యకర్తల దాడుల్లో గాయపడి నల్లగొండలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌, సీపీఎం కార్యకర్తలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసిహారెడ్డి, నాయకులు నల్లమోతు సిద్ధార్థతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, సీపీఎం కొన్ని చోట్లా కలసి పనిచేశాయని,

మిర్యాలగూడలో కాంగ్రెస్‌ తప్పిదాలను కవర్‌ చేసుకునేందుకే కాంగ్రెస్‌ గుండాలు దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇంకా చాలా చోట్ల ఇలాంటి ప్రయత్నం చేసారని, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలుగా మారారని, జిల్లా అధికారులు నిస్సహాయులుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు బూత్‌లను ఆక్రమించే యత్నం చేసినా ఎన్నికల అధికారులు పట్టించు కోలేదన్నారు. మిర్యాలగూడలో జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement