
భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలు ఇండోనేషియాలో విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి సులవేసి దీవిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందారు. వివిధ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అక్కడి అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 13 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రబ్బరు పడవలు, ఇతర వాహనాలను ఉపయోగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్‌లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్‌లో 37 మంది మృతి చెందారు. అల్ జజీరా నివేదిక ప్రకారం విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 37. 74 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.
ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎడ్వర్డో లైట్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో ప్రభావిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.