పెద్దింట్లమ్మా.. పాహిమాం | - | Sakshi
Sakshi News home page

పెద్దింట్లమ్మా.. పాహిమాం

Nov 2 2026 1:29 AM | Updated on Nov 2 2026 1:29 AM

పెద్దింట్లమ్మా.. పాహిమాం సుబ్బారాయుడికి పూజలు జై వనరూపిణీ.. జై విజయకారిణి ప్రచార రథానికి స్వాగతం సోదరుడిపై చాకుతో దాడి

కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు మాపై కురిపించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తీతో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పెద్దింట్లమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, దేవస్థాన గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.32,595 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు.

ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలోని స్వామి వారి పుట్టలో పాలుపోసి స్వామిని దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్లశాల వద్ద నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు, కుంకుమలతో పూజలుచేశారు. భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసాదం స్వీకరించారు. ఏర్పాట్లను సహాయ కమిషనర్‌ ఆర్‌.గంగాఽశ్రీదేవి, చైర్మన్‌ బొంగు రవికుమార్‌, య సిబ్బంది పర్యవేక్షించారు.

బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి పూజలు చేశారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రథం ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణానికి విచ్చేసింది. ఈ సందర్భంగా భక్తులు రథానికి ఘన స్వాగతం పలికారు. కార్తీక మాసంలో నిర్వహించే వివిధ ధార్మిక కార్యక్రమాలు, ధర్మ ప్రచారంలో భాగంగా సత్యదీక్ష ప్రచారకర్త నల్లిమిల్లి కృష్ణబాబు భక్తులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీ నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు 27 రోజులు, 18 రోజులు, 9 రోజుల పాటు సత్యదీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించి, ఆ వివరాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణ, రథసారథి గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు: కుటుంబ కలహాలు రక్తసంబంధాల మధ్య చిచ్చుపెట్టాయి. మద్యం మత్తులో జరిగిన గొడవలో అన్నదమ్ములు పరస్పరం దాడి చేసుకున్న సంఘటన పూళ్ల జంగం వీధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జి. నాగసాయి, సురేష్‌ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య కుటుంబ కలహాల కారణంగా తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అన్న గెట్టం నాగసాయి, వృద్ధురాలైన తన అమ్మమ్మ కసిరెడ్డి అమ్మాజీపై చాకుతో దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఆగ్రహానికి గురైన తమ్ముడు జి. సురేష్‌.. అదే చాకుతో అన్న నాగసాయిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో నాగసాయి మెడ భాగంలో తీవ్ర గాయాలై, నరాలు తెగిపోయాయి. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న నాగసాయి, అమ్మాజీలను చూసి స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. భీమడోలు 108 అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement