వైఎస్సార్‌సీపీ ప్రచారంలో ‘కూటమి’ కవ్వింపులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రచారంలో ‘కూటమి’ కవ్వింపులు

Nov 2 2026 1:29 AM | Updated on Nov 2 2026 1:29 AM

ద్వారకాతిరుమల: ఎన్నికల ప్రచారం అంటే ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం. కానీ ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార వాహనం వద్ద టీడీపీ, జనసేన జెండాలను ఊపుతూ ఆ పార్టీల కార్యకర్తలు హడావుడి సృష్టించారు. అక్కడితో ఆగకుండా టీడీపీ జెండాలున్న బైక్‌లతో వైఎస్సార్‌సీపీ బైక్‌ ర్యాలీలో కలసి నినాదాలు చేస్తూ.. హంగామా చేసి, వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించడంతో ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదు. మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత, ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి బుసనబోయిన విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు కట్టా చిరంజీవితో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రచార ర్యాలీలోకి ఇతర పార్టీల జెండాలతో కార్యకర్తలు ప్రవేశించడం, బైక్‌లతో హంగామా చేయడం వెనుక ఉద్దేశమేమిటన్న చర్చ స్థానికంగా మొదలైంది. ఇదే గ్రామంలో గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారానికి వస్తున్న తరుణంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు గ్రామంలోకి చేరుకుని ఈ విధంగా వ్యవహరించారు. వీరి వ్యవహారశైలిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పోటీలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా.. ప్రత్యర్థి పార్టీ ప్రచారంలోకి వెళ్లి హంగామా చేయడం, ఘర్షణకు దారితీసే పరిస్థితులను సృష్టించడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల వేళ ప్రతి రాజకీయ పార్టీ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రచారం సందర్భంగా చోటుచేసుకునే ఇలాంటి పరిణామాలు కారణంగా గ్రామాల్లో శాంతిభద్రతలు లోపించే ప్రమాదం ఉందని, కూటమి నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు హితవు పలికారు.

ఎం.నాగులపల్లిలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలోకి టీడీపీ, జనసేన కార్యకర్తల ప్రవేశం

జెండాలు ఊపుతూ.. బైక్‌లతో హంగామా

గొడవలు పెట్టుకునేందుకు ప్రయత్నాలు

వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంయమనంతో తప్పిన ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement