వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త మృతి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త మృతి

Nov 2 2026 1:29 AM | Updated on Nov 2 2026 1:29 AM

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త మృతి విద్యుదాఘాతంతో గేదె మృతి గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్రగాయాలు

నూజివీడు: ఎన్నికల ఉత్కంఠ, పోలింగ్‌ హడావుడి క్షణాల్లో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. నూజివీడు పట్టణంలోని 30వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటగిరి పూర్ణిమ భర్త సతీష్‌ (54) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. మరో గంటలో పోలింగ్‌ ప్రారంభమవుతుందనగా, ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో సతీష్‌ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సతీష్‌ను పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో అక్కడి నుంచి ఆయన్ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో నూజివీడు గాంధీనగర్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సతీష్‌ కుమారుడు అనూప్‌ అమెరికాలో ఉండటంతో అక్కడి నుంచి రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం.

పెనుగొండ: మండలంలోని సిద్ధాంతం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఓ గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన పాడి రైతు అంజూరి త్రిమూర్తులు తన గేదెను కాలువలో కడిగి పైకి తీసుకొస్తుండగా, తుప్పల్లో తెగిపడి ఉన్న విద్యుత్‌ తీగ తగలడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని, దీంతో తాను తీవ్రంగా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విద్యుత్‌ అధికారులకు, పశువైద్యాధికారి భానుతేజకు సమాచారం అందించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి ఘటన స్థలానికి చేరుకుని గేదెకు పోస్టుమార్టం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

పెంటపాడు: టీ కాచేసేందుకు గ్యాస్‌ పొయ్యి వెలిగించగా గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పెంటపాడు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కిలపర్తి ఎర్రయ్య, ధనలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వారి కుమారుడు ఇంటికి రావడంతో, అతడి కోసం వేడి నీళ్లు పెట్టి టీ కాసేందుకు ఎర్రయ్య గ్యాస్‌ వెలిగించారు. ఆ సమయంలో ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ లీకై పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో గ్యాస్‌కు సమీపంలో ఉన్న దంపతుల దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. పేలుడు తీవ్రతకు ఇంటి తలుపులు, బాత్‌రూమ్‌ తలుపులు చెల్లాచెదురయ్యాయి. పెద్ద శబ్దం విని నిద్రలో నుంచి లేచి వచ్చిన స్థానికులు, బాధితులను వెంటనే గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం, వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వారిని తణుకులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆ దంపతులు అక్కడ చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement