ఉండి: అగ్ని ప్రమాదం సంభవించి గేదెల పాక దగ్ధం కావడంతో అందులో కట్టి ఉన్న ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మండలంలోని వాండ్రం గ్రామానికి చెందిన మల్లుల శ్రీనివాస్ గ్రామ శివారులో కౌలు భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పొలం గట్టుపై గేదెల పాక వేసి వాటిని మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. శనివారం సాయంత్రం 7:15 గంటల సమయంలో గేదెలను పాకలో కట్టేసి సమీప పొలం వద్దకు వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి, ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో పాక కాలిపోయి, అందులోని ఆరు గేదెలు సజీవ దహనమయ్యాయి. వాటి విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారి మంతెన రాంప్రసాద్ రాజు, ఆర్ఐ కార్తీక్, వీఆర్వో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


