● ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
● ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి గాయాలు
తణుకు అర్బన్: ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తణుకు మండలం దువ్వ గ్రామ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన బండారు మెంటయ్య (50), మామిడిచెట్టి సత్యనారాయణ ఇద్దరూ కూలి పనుల నిమిత్తం గురువారం నల్లజర్ల మండలం ఆవుపాడుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. దువ్వ గ్రామం దాటిన తరువాత పెట్రోలు బంకు సమీపానికి రాగానే వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెంటయ్యను 108 వాహనం ద్వారా ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందారు, సత్యనారాయణ తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన తునికి చెందిన భక్తురాలు డి.నాగలక్ష్మి గురువారం నిత్యాన్నదాన భవనంలో తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో నగదు, సెల్‌ఫోన్ ఉన్నాయి. అన్నదాన సదనంలో పనిచేసే కార్మికులకు పర్సు దొరకడంతో డొనేషన్ కౌంటర్ సిబ్బందికి అప్పగించారు. వారు బాధితురాలికి పర్సును అందజేశారు. సిబ్బంది నిజాయతీని పలువురు అభినందించారు.


