యలమంచిలి: మండలంలోని మేడపాడు గ్రామంలో సుజాత మాంటిస్సోరీ స్కూల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాజ పడమర గ్రామానికి చెందిన కడలి వాసు (36) తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీపై వేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న సైకిల్ ను ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 వాహనంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకు తరలించారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
భీమవరం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్ దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి గత నెల 25న సొంత పనిపై భీమవరం రాగా గుండెపోటు వచ్చింది. దాంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స సమయంలో ఆయన వద్ద ఉన్న నగదు, ఫోన్ ను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ, ఘటన జరిగి 20 రోజులు దాటినా ఇప్పటివరకు అధికారికంగా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలిదిండి(కై కలూరు): అదుపుతప్పిన ఆటో బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన కలిదిండి మండలం సంతోషపురం వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూలలంక గ్రామానికి చెందిన సాదే వెంకటేశ్వరరావు (42) ఆటో డ్రైవర్. గురువారం రాత్రి 11 గంటల సమయంలో కలిదిండి నుంచి ఇంటికి ఆటోలో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు 108కు సమాచారం అందించగా, పరీక్షించిన సిబ్బంది ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సౌరభ్ కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడి భార్య ఉపాధి నిమిత్తం కువైట్ లో ఉంటున్నారు.
దెందులూరు: జాతీయ రహదారిపై కొమిరేపల్లి పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సింగవరం గ్రామానికి చెందిన వంజరపు ప్రసాద్ మృతి చెందాడు. చేనుకి వెళ్లేందుకు ప్రసాద్ రోడ్డుపైకి వస్తుండగా, ఏలూరు నుంచి భీమడోలు వైపు వేగంగా వెళ్తున్న కారు ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


