వైఎస్సార్‌సీపీ గూడెం కన్వీనర్ రఘురాం
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధృతరాష్ట్ర పాలన సాగిస్తోందని అప్సడా మాజీ వైస్‌చైర్మన్, వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం విమర్శించారు. గురువారం ఆయన లండన్ నుంచి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదని, వరి నుంచి కోకో వరకు ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తే గానీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ధరల స్థిరీకరణ కోసం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.7,800 కోట్లు కేటాయించి ఆపద కాలంలో రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ఉచిత పంటల బీమా కింద రూ.3,500 కోట్లు కేటాయించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదన్నారు. ఆక్వా రంగం కుదేలవుతోందని, ఫీడ్ రేటు కిలోకు రూ.14 వరకు పెరిగితే రూ.2 తగ్గించి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా రైతులకు అన్నిరకాల సేవలు అందేవని, యూరియా విషయంలో కచ్చిత పర్యవేక్షణ ఉండేదన్నారు. అప్పట్లోనే ఆక్వా జోన్ పరిధిలో 50,800 క నెక్షన్లు ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం జీఓ 169తో పవర్ ఫ్యాక్టర్ నిబంధనతో రైతులను కొత్త తరహా మోసం చేస్తోందన్నారు. ఈ నిబంధన వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను అన్నివిధాలా మోసం చేస్తోందని, అయి నా ప్రశ్నిస్తానన్న నాయకుడు నోరు మెదపడం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రజాదరణను ఎవరూ అడ్డుకో లేరని, నష్టపోయిన అన్నివర్గాలకు అండగా ఉంటూ వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు.


