ఏసీబీకి చిక్కిన డీటీ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన డీటీ

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

ఏసీబీకి చిక్కిన డీటీ

జంగారెడ్డిగూడెం: భూమి మ్యూటేషన్‌ రద్దుకు సంబంధించి కేసు తీర్పు కాపీని ఇచ్చేందుకు సొమ్ములు తీసుకుంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు గురువారం ఏసీబీ అధికారులకు చిక్కా రు. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పోతన సుకుమార్‌ అనే వ్యక్తికి తండ్రికి చెందిన ఎకరా భూమి ఉంది. నిమ్మలగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూమి తాత నుంచి వీలునామా ద్వారా ఆయన తండ్రికి సంక్రమించింది. ఈ భూమికి సంబంధించి జంగారెడ్డిగూడెం తహసీల్దార్‌ కార్యాలయంలో మ్యూటేషన్‌ కూడా పూర్తయ్యింది. అయితే కుటుంబ వివాదాల కారణంగా ప్రత్యర్థులు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించి ఈ మ్యూటేషన్‌ను రద్దు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివాదంపై విచారణకు హాజరైన సుకుమార్‌కు కేసు తీర్పు కాపీని ఇచ్చేందుకు వెంకటేశ్వరరావు రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. తాను అంత ఇవ్వలేనని సుకుమార్‌ రూ.20 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌తో జరిగిన సంభాషణను రికార్డు చేసి ఏలూరు ఏసీబీ అధికారులకు ఇచ్చారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సుకుమార్‌ గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వరరావుకు రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు, సీఐలు బాలకృష్ణ , శ్రీనివాసరావు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు వెంకటేశ్వరరావును అరెస్టు చేసి రాజమండ్రి ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ అధికారులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement