ఆన్‌లైన్‌ చేసిన ఐదు ఓట్లు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ చేసిన ఐదు ఓట్లు

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

ఆన్‌లైన్‌ చేసిన ఐదు ఓట్లు సావనీర్‌ ఆవిష్కరణ మద్ది క్షేత్రానికి రూ.2.72 లక్షల ఆదాయం నేటినుంచి ‘వీబీ జీరామ్‌జీ’

దెందులూరు: ఏలూరు రూరల్‌ మండలం శ్రీపర్రులో నాగరాజు కుటుంబంలో ఐదు ఓట్లను ఆన్‌లైన్‌ చేశారు. ఆ కుటుంబంలోని ఓట్లు ఆన్‌లైన్‌ చేయడానికి బీఎల్‌ఓ నిరాకరించడంతో ఓటరు జాబితా సవరణలో సమస్యలు ఏంటి సార్‌ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఏలూరు రూరల్‌ మండల తహశీల్దార్‌ జి విజయకుమార్‌ రాజు స్పందించి మంగళవారం ఉదయం శ్రీపర్రు సచివాలయానికి వెళ్లారు. బాధిత నాగరాజు, బీఎల్‌వో షరీఫ్‌ను పిలిపించి ఘటనపై విచారణ నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే భారతీయ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నాగరాజు కుటుంబంలోని ఐదు ఓట్లను ఆన్‌లైన్‌ చేశారు. బీఎల్‌ఓలు అందరూ విధిగా వారికి ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల ఫారాలు అందజేసి పూర్తి చేసిన తర్వాత వాటిని తీసుకువచ్చి ఆన్‌లైన్‌ చేయాలని తహసీల్దార్‌ ఆదేశించారు. సచివాలయాల్లో కూర్చొని ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివ ఉన్నారు.

ఏలూరు (టూటౌన్‌): రైతాంగ ఉద్యమాల స్ఫూర్తితో బలమైన రైతు కూలీ ఉద్యమాన్ని నిర్మించాలని ఏఐకేఎంకేఎస్‌ అఖిలభారత మహాసభ సావనీరు ఆవిష్కరణ సభలో వక్తలు పిలుపునిచ్చారు. ఏఐకేఎంకేఎస్‌ అఖిలభారత మహాసభల సావనీర్‌ ఆవిష్కరణ సభ ఏపీ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరులోని లేడీస్‌ క్లబ్‌ నందు జిల్లా కార్యదర్శి షేక్‌ బాషా అధ్యక్షతన జరిగింది. ముందుగా సావనీరును దారి దీపం పత్రికా సంపాదకులు డీవీఎస్‌ వర్మ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాన వక్త ఏఐకేఎంకేఎస్‌ అఖిల భారత అధ్యక్షులు ఎస్‌ ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాల మూలంగా అన్ని రాష్ట్రాల్లోనూ రైతాంగం తీవ్రమైన సమస్యల్లో కూరుకు పోయారన్నారు సభలో బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ సంకు మనోరమ, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.వీరబాబు, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్‌ నాగరాజు, దళిత నాయకులు మామిడూరి మహంకాళి పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో తమలపాకుల అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ. 2,72,533 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,473 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, దేవస్థాన అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఈఓ) ఆర్‌వీ చందన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఏలూరు (టూటౌన్‌): ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన వికసిత్‌ భారత్‌–గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (వీబీ జీరాంజీ) పథకం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని డ్వామా పీడీ కేవీ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి పథకం పనులు ప్రారంభం, 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించే సమావేశానికి ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధులను తప్పక ఆహ్వానించాలని పీడీ సుబ్బారావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement