వీరవాసరం: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం వీరవాసరం మండలం తోలేరులోని కామన్ ఫెసిలిటీ సెంటర్‌లో మహిళలకు నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ కుట్టు మిషన్‌న్‌పై నెల రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో కలెక్టర్ ముచ్చటించి, రుణాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఎలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల సాధికారతే కుటుంబాల అభివృద్ధికి పునాది అని అన్నారు. ప్రతి మహిళ తనకు లభించే అవకాశాలను వినియోగించుకొని స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.ఎస్.ఎస్. వేణుగోపాల్, తహసీల్దార్ రామాంజనేయులు, లేస్ పార్క్ ఏపీఎం రమేష్, తోలేరు మాజీ సర్పంచ్ కె.లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


