పోలవరం రూరల్: మండలంలోని రేపల్లెవాడ వద్ద శ్రీ సత్యసాయి మంచినీటి పథకానికి సంబంధించిన ప్రధాన పైప్‌లైన్ మార్గం పగిలిపోయింది. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం కన్నాపురం నుంచి పోలవరం వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలు విపరీతంగా సాగుతున్నాయి. భారీ వాహనాల ఒత్తిడికి తట్టుకోలేక ఇక్కడి భూగర్భ పైప్‌లైన్‌లు తరచూ పగిలిపోతున్నాయి. దీంతో ఒకవైపు తాగునీరు వృథాగా పోతుండగా, మరోవైపు ఆయా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. పైప్‌లైన్ పగిలి నీరంతా రోడ్డుపైకి చేరడంతో రహదారి మొత్తం బురదమయంగా మారింది. నిర్మాణంలో ఉన్న రోడ్డు కావడంతో బురద మరింత ఎక్కువై భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పైప్‌లైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి, పదే పదే పగలకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఏజెన్సీ గ్రామస్థులు వేడుకుంటున్నారు.


