కామవరపుకోట: నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను.. ప్రభుత్వం స్పందించి ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేయాలి అంటూ పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కళ రామాంజనేయులు ఇటీవల ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. రాజమండ్రికి చెందిన షేక్ జిన్నా షజరత్ అనే వ్యక్తి సౌదీలో హాస్పిటల్ వాచ్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రయాణ, వీసా ఖర్చుల పేరిట ఫోన్‌పే ద్వారా రూ.1,35,000, వైద్య పరీక్షల నిమిత్తం రూ.15,000 నగదు తీసుకున్నాడు. అనంతరం రామాంజనేయులును సౌదీ అరేబియా పంపించి, హామీ ఇచ్చిన ఉద్యోగం ఇవ్వకుండా ఎడారి ప్రాంతంలో మేకలు, గొర్రెల కాపరిగా పనిలో పెట్టాడు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన రామాంజనేయులు.. తాను పడుతున్న నరకయాతనను వివరిస్తూ, తనను స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి తల్లి కళ కనకలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు.


