ఎద్దులు తరలిస్తున్న వాహనం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఎద్దులు తరలిస్తున్న వాహనం స్వాధీనం

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

ఎద్దులు తరలిస్తున్న వాహనం స్వాధీనం సెల్‌ఫోన్‌ చోరీ చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష, జరిమానా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం దాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష విర్డ్‌ ఆస్పత్రిలో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు

దెందులూరు: విజయనగరం నుంచి హనుమాన్‌ జంక్షన్‌ సంతకు ఎద్దుల తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సోమవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నామని దెందులూరు ఎస్సై డి.వెంకట్‌ కుమార్‌ అన్నారు. దెందులూరు గ్రామానికి చెందిన జ్యోతుల చంద్రశేఖర్‌ దెందులూరు చెక్‌ పోస్ట్‌ వద్ద విజయనగరం నుంచి హనుమాన్‌ జంక్షన్‌ సంతకు వెళుతున్న వాహనాన్ని నిలుపుదల చేసి దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారన్నారు. నీరు, మేత లేకుండా సంతకు తీసుకెళ్తున్నారని చంద్రశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జలం ప్రదీప్‌ కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.

ఆగిరిపల్లి: సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రాణిమేకల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి సెల్‌ఫోన్‌ చోరీ చేశారు. బాధితుడి వివరాలు ప్రకారం శ్రీనివాసురావు ట్రాక్టర్‌పై ఆగిరిపల్లి వస్తుండగా మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ట్రాక్టర్‌ టైర్‌ ఊడిపోతోందని శ్రీనివాసరావుకు చెప్పడంతో, ట్రాక్టర్‌ ఆపి టైర్లను తనిఖీ చేశాడు. దుండగులు జేబులోని సెల్‌ఫోను లాక్కొని పరారయ్యారు. బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నూజివీడు: బాకీ నిమిత్తం ఇచ్చిన చెక్కు చెల్లని నేరానికి ఎన్టీఆర్‌ జిల్లా విజయడలోని గుణదలకు చెందిన జంపని శ్రీసాయి శ్రీజకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.40 లక్షలు జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ వేల్పుల కృష్ణమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ వివరాల ప్రకారం కృష్ణాజిల్లా బాపులపాడుకు చెందిన అద్దేపల్లి సురేష్‌ 2021 సెప్టెంబరులో శ్రీజకు రూ.31 లక్షలు ఆమె వ్యాపార అవసరాల నిమిత్తం అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత సురేష్‌ తన బాకీ చెల్లించమని అడగగా శ్రీజ 2022 జూన్‌లో రూ.33.55 లక్షలకు చెక్కును ఇచ్చింది. దీనిని తన బ్యాంకు అక్కౌంట్‌లో నగదు వసూలు నిమిత్తం వేయగా శ్రీజ అకౌంట్‌లో నగదు లేదని బ్యాంకు అధికారులు చెక్కును తిప్పిపంపారు. దీనిపై సురేష్‌ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం శ్రీజకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

ఏపీ నిట్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రమణరావు

తాడేపల్లిగూడెం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని నిట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ఎన్‌.వి.రమణరావు పిలుపునిచ్చారు. నిట్‌లోని సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రారంభమైంది. సవాలుతో కూడిన భౌగోళిక పరిస్థితులలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యాధునిక సాధనాలు, పద్ధతులు అనే అంశంపై పది రోజుల పాటు నిర్వహించనున్న ఆన్‌లైన్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. ఎన్‌.వి.రమణరావు మాట్లాడుతూ జ్ఞాన మార్పిడి, వృత్తిపరమైన అభివృద్ధి, సహకార పరిశోధనలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందన్నారు. నిట్‌ వరంగల్‌ ఐసీటీ అకాడమీ చీప్‌ ఇన్వెస్టిగేటర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.అనురాధ, నిట్‌ ఈఐసీటీ అకాడమీ కో ఆర్డినేటర్‌ పులి కిషోర్‌లు కార్యక్రమ లక్ష్యాలు, ప్రాధాన్యత రించి వివరించారు. నిట్‌ డీన్‌ ప్యాకల్టీ అపైర్స్‌ జి.రవికిరణ్‌శాస్త్రి, డాక్టర్‌ పవన్‌కుమార్‌ చమ్లింగ్‌, డాక్టర్‌ ప్రత్యూష జయంతి పాల్గొన్నారు.

భీమవరం: దాడి చేసి డబ్బులు అపహరించిన కేసులో నిందితుడికి 6 నెలలు జైలు శిక్ష విధించినట్లు భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ.రమేష్‌ సోమవారం తెలిపారు. గతేడాది మే 25న చినరంగనిపాలెంకు చెందిన సామన వీర వెంకట సత్యనారాయణను బేతనీ పేటకు చెందిన బబ్లు యాదవ్‌ కత్తితో బెదిరించి దాడి చేసి, బాధితుడి వద్ద ఉన్న రూ.2 వేల నగదును బలవంతంగా లాక్కునాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో భీమవరం సెకండ్‌ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎన్‌.జ్యోతి 6 నెలలు జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని సీఐ తెలిపారు.

ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్‌ ఆస్పత్రిలో సోమవారం రోబోటిక్‌ ఆర్థో శస్త్ర చికిత్సలు నిర్వహించిన డాక్టర్‌ కృష్ణ కిరణ్‌, తదితరులను ఆస్పత్రి ట్రస్ట్‌ చైర్మన్‌ ఎస్‌వీ సుధాకరరావు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కృష్ణ కిరణ్‌ మాట్లాడుతూ రోబోటిక్‌ టెక్నాలజీతో శస్త్రచికిత్సలు చేయడం వల్ల రోగికి మెరుగైన, ఖచ్చితమైన, సురక్షితమైన చికిత్స అందుతుందన్నారు. సర్జన్‌ ఆదేశాల మేరకు రోబో పని చేస్తుందన్నారు. రోబో సాయంతో విర్డ్‌లో ఆరుగురికి ఆర్థో శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విర్డ్‌ ఆస్పత్రి ట్రస్ట్‌ సభ్యులు వి.నారాయణ మూర్తి, ఎస్‌వీఎన్‌ఎన్‌ నివృతరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ, వైద్యులు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement