నిరుపయోగంగా పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ యూనిట్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ యూనిట్‌

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

నూజివీడు: నూజివీడు పట్టణంలో ప్రారంభించిన పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ యూనిట్‌ నిరుపయోగంగా ఉంది. దీనిని ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారో దానిని నేరవేర్చుతున్న దాఖలాలు కనిపించడం లేదు. పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు గాను 2013 మార్చి 20న అప్పటి ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ సబ్‌కంట్రోల్‌ యూనిట్‌ గత పదేళ్లకు పైగా ఖాళీగానే ఉంది. ఇక్కడ ఏనాడు పోలీస్‌ సిబ్బందిని చూసిన దాఖలాలు లేవు. కనీసం కానిస్టేబుల్‌ గాని, హోంగార్డులను గాని నియమించిన పరిస్థితి లేదు. పట్టణాలలో నిరంతరం జరిగే చిన్న చిన్న గొడవలు, ఈవ్‌ టీజింగ్‌, ట్రాఫిక్‌ అతిక్రమణ, గొలుసు దొంగతనాలు, చిల్లర నేరాలు తదితర వాటిని అరికట్టేందుకు పట్టణాలలో ఎక్కువ రద్దీ ఉండే కూడళ్ళలో ఏర్పాటు చేయాలని భావించి పట్టణంలోని పండ్లమార్కెట్‌ సెంటరులో పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. దీనిలో ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక హెడ్‌కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుల్‌లు ఉండి విధులు నిర్వహించాలి. ఇక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. ఈ యూనిట్‌ ప్రారంభించి పదమూడేళ్లు గడిచినా నిరూపయోగంగానే ఉంది. దీంతో యూనిట్‌ అలంకారప్రాయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం మొక్కుబడిగా కూడా ఇక్కడ ఎవరిని నియమించడం లేదు. ఇది పనిచేయకపోవడంతో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన ఇష్టారాజ్యంగా మారింది. వన్‌వే నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఒక్కొక్కసారి చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో డీఎస్పీ స్పందించి పోలీస్‌ సబ్‌కంట్రోల్‌ యూనిట్‌ పనిచేసేలా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

వన్‌వే ఉల్లంఘన

పట్టణంలోని పలు రహదారులను వన్‌వే గా చేశారు. పండ్లమార్కెట్‌ సెంటర్‌ నుంచి చిన్నగాంధీబొమ్మ సెంటర్‌ వైపుకు వచ్చే రోడ్డులో వాహనదారులు యథేచ్ఛగా వన్‌వే నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. బస్టాండు వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ వెంకటేశ్వరస్వామి కోవెల, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్‌ మీదుగా తిరిగి చిన్నగాంధీబొమ్మ సెంటర్‌కు రావాలి. అలా కాకుండా కార్లు, ఆటోలు, ఒక్కొక్కసారి ఆర్టీసీ బస్సులు సైతం వన్‌వే నిబంధనలను అతిక్రమిస్తూ నేరుగా చిన్నగాంధీబొమ్మ సెంటర్‌కు వచ్చేస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement