జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటనపై బాధితులు సోమవారం ఉదయం బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ సొమ్ముకు గ్యారెంటీ ఇవ్వాలని, త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులను నిలదీశారు. అనంతరం బ్యాంకు నుంచి ఏఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి, ఏఎస్పీ సుస్మితను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. బ్యాంకు యాజమాన్యం కేవలం గోల్డ్ అప్రైజర్ రాజుపై మాత్రమే ఫిర్యాదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం కేవలం ఒకరి వల్ల సాధ్యం కాదని, ఇందులో బ్యాంకు సిబ్బంది హస్తం కూడా ఉండి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ కోణంలోనూ విచారణ జరపాలని కోరారు. అధికారులు సుమారు 4.3 కేజీల బంగారమే మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొనగా, వాస్తవానికి బాధితుల లెక్కల ప్రకారం 6 కేజీలకు పైగా బంగారం పోయిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏఎస్పీని వేడుకున్నారు. ఖాతాదారుల వినతిపై ఏఎస్పీ సుస్మిత సానుకూలంగా స్పందించారు. ఈ గోల్డ్ స్కామ్‌పై పోలీసులు ఇప్పటికే లోతైన దర్యాప్తు మొదలుపెట్టామని స్పష్టం చేశారు. బ్యాంకు సిబ్బంది పాత్రపై సైతం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని, బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ఖాతాదారులు అంతవరకు సంయమనం పాటించాలని ఆమె కోరారు.


