తలకెక్కించుకోకపోతే ప్రాణాపాయం | - | Sakshi
Sakshi News home page

తలకెక్కించుకోకపోతే ప్రాణాపాయం

Jun 27 2026 12:19 AM | Updated on Jun 27 2026 12:19 AM

తలకెక్కించుకోకపోతే ప్రాణాపాయం

హెల్మెట్‌ను తప్పక ధరించాలి

హెల్మెట్‌ విషయంలో ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యం

ప్రమాదాలకు గురై ప్రాణాలుపోతున్న వైనం

ఆగిరిపల్లి : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారు. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిసినా, కొందరు వాహన చోదకులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. తలకు ధరించాల్సిన హెల్మెట్‌ను బైక్‌కు తగిలించి ప్రయాణిస్తూ, అశ్రద్ధతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. యువత గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆరాటంతో అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. దీనికి తోడు హెల్మెట్‌ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. గతంలో వాహనం కొనుగోలు చేసే సమయంలోనే హెల్మెట్‌ కూడా కొనాలని పోలీసులు నిబంధన విధించారు. హెల్మెట్‌ ఉంటేనే వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా హెల్మెట్‌ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూనే, నిబంధనలను కఠినతరం చేస్తోంది.

హెల్మెట్‌ ఎందుకు వాడాలంటే..?

మానవ శరీరంలో అత్యంత కీలకమైన భాగం మెదడు. ఇది అన్ని శరీర భాగాలను నియంత్రిస్తూ, సమతుల్యతను కాపాడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బ తగిలితే మెదడు కణాలు నశిస్తాయి. న్యూరాన్లు ఒకసారి నశిస్తే తిరిగి పునరుత్పత్తి కావు. ఫలితంగా శరీర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. దెబ్బ తీవ్రతను బట్టి కొన్ని అవయవాలు శాశ్వతంగా పక్షవాతానికి గురికావడం లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగుతాయి. హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకు, మెడకు తీవ్ర గాయాలు కాకుండా రక్షణ లభిస్తుంది. అలాగే ప్రయాణంలో దుమ్ము, గాలి నుంచి కూడా ఇది కళ్లను కాపాడుతుంది.

పోలీసులు జరిమానా వేస్తారనే భయంతో కాకుండా, తమ ప్రాణాల విలువను, కుటుంబానికి తమకున్న ప్రాధాన్యతను గుర్తించి వాహనదారులు స్వచ్ఛందంగా హెల్మెట్‌ ధరించాలి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే హెల్మెట్‌ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. బైక్‌పై బయటకు వెళ్లే కుటుంబ సభ్యులకు హెల్మెట్‌ ధారణను గుర్తు చేసే బాధ్యతను ఇంట్లోని వారు కూడా తీసుకోవాలి.

– కె. శుభ శేఖర్‌, ఎస్సై ఆగిరిపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement