భీమడోలు: సార్వాలో ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలని భీమడోలు మండల వ్యవసాయాధికారి ఎస్‌పీవీ ఉషారాణి రైతులను కోరారు. గుండుగొలనులో గురువారం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సార్వాలో నారుమడులను రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. సార్వాలోని యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సీజన్‌లో ఎల్‌నివో ప్రభావం నేపథ్యంలో వర్షాలు తగ్గుతాయని, రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరారు. ఎకరాకు యూరియాను బస్తాన్నర మాత్రమే అందిస్తారని, ఎక్కువ వేస్తే వరి సాగుకు ముప్పు వాటిల్లుతుందన్నారు. మండల వ్యాప్తంగా 13,250 ఏకరాల్లో వరి సాగు చేస్తున్నారని, అందుకు 650 ఎకరాల్లో నారుమడులు అవసరమని, ఇప్పటి వరకు మండలంలో 575 ఏకరాల్లో నారుమడులు వేశారన్నారు.


