తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రజా రవాణాలో ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేయడం తగదని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని ప్రజారవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఆలీ డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ గ్యారేజీ గేటు వద్ద ఆదివారం రెండో రోజు జరిగిన ధర్నాలో ఆలీ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని, మూసివేసిన ఆర్టీసీ డిపోలను తిరిగి తెరవాలన్నారు. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలన్నారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వారికి అప్పగించే విధానం వీడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, తాత్కాలిక భృతి ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని డి మాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 39 సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిపో అధ్యక్షుడు టి.బుజ్జిబాబు, రాష్ట్ర నాయకులు శివ, కోశాధికారి నరసింహ, వీరన్న, బాషా తదితరులు పాల్గొన్నారు.


