పెట్రో మంటలు
ఆదుకోని కూటమి ప్రభుత్వం
పశ్చిమాసియా కల్లోలంతో చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధరలకు రెక్కలు రాగా శుక్రవారం నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29, డీజిల్‌కు రూ.3.14 చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ రూ.113.12కు, డీజిల్ రూ.100.78 చేరాయి. ఈ మేరకు జిల్లాలోని వినియోగదారులపై రోజుకు రూ. 19.6 లక్షలు భారం పడుతుందని అంచనా.
సాక్షి, భీమవరం: నెలల తరబడి సాగుతున్న అమెరికా– ఇరాన్ యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి రెండో వారంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డొమెస్టిక్ సిలెండర్ రూ.892 నుంచి రూ. 952కు, వాణిజ్య సిలెండర్ రూ.1850.50 నుంచి రూ. 2177కు పెరిగాయి. రెండు నెలలు తిరగకుండానే వాణిజ్య సిలెండర్ ధరను రూ.3,170కు పెంచింది. జిల్లాలో 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్) కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఏడు సిలెండర్లు చొప్పున జిల్లాలోని వినియోగదారులు 43.5 లక్షల డొమెస్టిక్ సిలెండర్లు వినియోగిస్తారని అంచనా. వంట గ్యాస్ కోసం రెండు నెలల క్రితం వరకు ఏడాదికి రూ.6,244 వెచ్చిస్తే, తాజా పెంపుతో రూ.6,664 చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన ధరలు మేరకు జిల్లా వాసులపై రూ. 24.94 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.
సామాన్యులకు సెగ : మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125 నుంచి రూ.135 వరకు ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ రూ.140 వరకు ఉండగా, సన్‌ఫ్లవర్, వేరుశనగ, బ్రాన్ ఇతర ఆయిల్ ధరలు రూ.150 నుంచి రూ. 200 పైగా పలుకుతున్నాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవక సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెంపుతో వారిపై అదనపు భారం పడింది. కమర్షియల్ సిలెండర్లు ధర భారీగా పెంచడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో ధరలకు రెక్కలొచ్చాయి. టిఫిన్, మీల్స్‌పై ప్లేటుకు రూ. 5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. మిగిలిన ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో రవాణా భారం కానుంది. సరుకుల రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ)తో పాటు రిలయన్స్, నయారా తదితర ప్రైవేట్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులు 165 వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల లీటర్ల పెట్రోల్, 4.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోల్‌పై రూ. 3.29, డీజిల్‌పై రూ. 3.14 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలను పెరిగాయి. ఈ మేరకు వినియోగదారులపై రోజుకు పెట్రోల్‌పై రూ. 4.93 లక్షలు, డీజిల్‌పై రూ. 14.13 లక్షలు కలిపి రూ.19.6 లక్షల భారం పడుతుంది.
నిత్యావసర ధరల నియంత్రణ, రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. 2024 అక్టోబరులో రేషన్ దుకాణాల ద్వారా కంది పప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. గత ఏడాది మార్చి నుంచి మొత్తం నిలిపివేసింది. కార్డుదారులకు రూ.20కు కిలో చొప్పున గోధుమ పిండి అందజేస్తామని చెప్పి జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టు పేరిట నగరాలు, ముఖ్య పట్టణాలకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లాలో 5,67,700 రేషన్ కార్డులకు భీమవరం పరిధిలో 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేదవర్గాల వారు కోరుతున్నారు.
లీటరు పెట్రోల్‌కు రూ.3.29,డీజిల్‌కు రూ.3.14 పెంపు
జిల్లాలో రోజుకు 4.5 లక్షల లీటర్ల డీజిల్, 1.5 లక్షల లీటర్ల వరకూ పెట్రోల్ వినియోగం
వినియోగదారులపై రోజుకు రూ.19.6 లక్షల భారం
ఇప్పటికే డొమెస్టిక్ సిలెండర్‌పై రూ.60, కమర్షియల్‌పై రూ.1370ల పెంపు
సామాన్యులపై పెరిగిన ధరల భారం


