గూడెంపై ఏసీబీ డేగకన్ను | - | Sakshi
Sakshi News home page

గూడెంపై ఏసీబీ డేగకన్ను

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

ఏసీబీ చేతిలో కీలక సమాచారం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై ఏసీబీ డేగకన్ను వేసిందా? గురువారం నాటి ఏసీబీ దాడితో దాడులు ఆగుతాయా? ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. గత రెండేళ్లుగా నియోజకవర్గంలోని అధికారులు కొందరు అవినీతి విషయంలో చురుగ్గా ఉన్నట్టు విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో సర్వేయర్‌ రౌతు రామకృష్ణ, తాజాగా గురువారం పట్టణ ఎస్‌ఐ నాగరాజు, బాలకృష్ణలపై ఏసీబీ దాడులతో రానున్న నెలల్లో మరిన్ని అవినీతి జలగలను పట్టే అవకాశాలున్నట్టు విస్తృతంగా చర్చ నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తున్నా, లారీల అక్రమ తరలింపునకు బ్రేక్‌ పడటంలేదు. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. దీంతో వచ్చిన అధికారగణం ఇష్టారాజ్యం సాగుతోంది. అధికార కేంద్రాలను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇక్కడ మన రాజ్యమే అన్నట్టుగా వ్యవహారాలున్నట్టుగా ప్రచారం ఉంది. తాజాగా మున్సిపాలిటీలో సామాజిక జాడ్యం కూడా వేళ్లూనుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సుపీరియారిటీ కాంప్లెక్స్‌ పద్ధతిలో వర్గాలుగా అధికారులు విడిపోయినట్టుగా చెబుతున్నారు.

దూకుడుగా ఏసీబీ అధికారులు

నియోజకవర్గానికి సుపరిచితుడుగా ఉన్న పట్టణ సర్వేయర్‌ రామకృష్ణపై ఏసీబీ దాడి చేసినట్టు దాడి అనంతర పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా గురువారం పట్టణ ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్‌ బాలకృష్ణల ఉదంతంలో అవినీతి కోణం కన్నా, వ్యక్తిగత ప్రాబల్యాల నేపథ్యంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడులు ఇకపై కొనసాగవచ్చని, నియోజకవర్గంలో ఆరుగురు అవినీతి అధికారుల వివరాల సేకరణలో ఏసీబీ దూకుడుగా ఉన్నట్టుగా సమాచారం. నాగరాజుపై దాడి చేయడానికి గాను 72 గంటల పాటు ఏసీబీ అధికారులు గూడెంలో మకాం వేసి, రెడ్‌ హ్యాండెడ్‌గా ఎస్సైను, కానిస్టేబుల్‌ను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఒక పోలీసు ఉన్నతాధికారికి బంధువుగా ఉన్న సిబ్బంది ఒకరి నేతృత్వంలోనే వ్యవహారాలు సాగినట్టు కలరింగ్‌ ఇచ్చారు. అధికారుల బదిలీలు, చేర్పులు, మార్పుల నేపథ్యంలో ఒక వ్యక్తిని హోల్డ్‌లో ఉంచినట్టుగా తెలుస్తోంది. శ్రీచైతన్యశ్రీవంతుడైన వసూలుదారుడు ఒకరు ఇద్దరు అధికారులకు కలెక్షన్‌ ఏజెంట్‌గా వ్యవహరించినట్టుగా బాహాటంగానే చెబుతున్నారు. వాస్తవానికి గురువారం జరిగిన ఏసీబీ దాడిలో కలెక్షన్‌ ఏజెంట్‌ బుక్‌ కావాల్సి ఉండగా, ట్రాప్‌లో బాలకృష్ణ పడినట్టు సమాచారం. మున్సిపాలిటీలో సర్వేయర్‌ను ట్రాప్‌ చేసి వాయిస్‌ రికార్డింగ్‌ ఆధారంగా మాత్రమే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తర్వాత కొందరి పోద్బలంతో జరిగిన ట్రాప్‌ అని తేలింది. తాజా ఉదంతంలో కూడా ప్రేమజంట వ్యవహారంలో ఎస్‌ఐ వాయిస్‌ రికార్డింగ్‌ క్రియాశీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో ఒక వ్యాపారికి సంబంధించి కుటుంబ వ్యవహారంలో వరకట్న వేధింపుల కేసును కాస్తా, హత్యాయత్నం కేసుగా నమోదు చేయించేందుకు గాను ఒక ప్రజాసంఘ నేత ద్వారా పట్టణ పోలీసులు కొందరితో సంప్రదింపులు సాగించినట్టుగా తెలుస్తోంది.

హిట్‌ జాబితాలో ఆరుగురు అధికారులు

నియోజకవర్గంలో ఒక రెవెన్యూ అధికారి అక్రమ రేషన్‌ వ్యవహారంలో చురుగ్గా ఉన్నట్టు, ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్‌ నేనున్నా, ఎవ్వరు నిన్ను టచ్‌ చేస్తారో నే చూసుకుంటా అనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. వారసత్వపు ఆస్తులు, మాస్టర్‌ప్లాన్‌లు, టీడీఆర్‌ బాండ్లు వంటి విషయాలలో ముగ్గురు మున్సిపాలిటీ అధికారుల వ్యవహార శైలి, తదనంతర వ్యవహారాలపై ఏసీబీకి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరు సామాజిక కార్డు బలంతో నెట్టుకొస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇంకొకరు సైలెంట్‌గా వ్యవహారాలు జరపడంలో నిష్ణాతుడంటున్నారు. ఇలాంటి ఆరుగురు వ్యక్తులకు చెందిన సమాచార సేకరణలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement