భీమవరం: గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్యుడు, అపర భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్ అని పలువురు వక్తలన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం జువ్వలపాలెం రోడ్డులోని కాటన్ విగ్రహం వద్ద శుక్రవారం కాటన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. రైతు కార్యాచరణ సమితి నాయకులు పాతపాటి మురళీకృష్ణంరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, కోళ్ల సీతారామ్, పి.రామకృష్ణంరాజు(పార్క్‌రాజు) మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కాటన్ అని కొనియాడారు. చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ తరాలు మారినా గోదారి గుండె చప్పుడు కాటన్ దొరేనని గోదావరి జిల్లాల వాసుల గుండెల్లో మాత్రం కాటన్ గుండె చప్పుడు ఎప్పుడూ వినిపిస్తాయన్నారు. కార్యక్రమంలో కె.కృష్ణంరాజు, టీవీవీ ప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా సుందరకుమార్, ఎస్.సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.


