కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయం
● జీడిపిక్కల కొనుగోలుకు ప్రభుత్వం వెనుకంజ
● దళారుల గుప్పిట్లో గిరిజన రైతులు
● గిట్టుబాటు ధర రాక ఇళ్లలోనే నిల్వ
బుట్టాయగూడెం: అమాయక గిరిజన రైతులు దళారులు చేతుల్లో చిక్కుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆ పంటలను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం జీడిమామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దళారులు చేతుల్లో గిరిజన రైతులు నిలువునా మోసపోతున్నారు. దళారుల దందా తెలిసినా ప్రభుత్వాధికారులు మిన్నకుండిపోవడం శోచనీయం.
మన్యంలో 1,100 మందికి పైగా రైతులు
గిరిజన ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 11 వందల మందికి పైగా గిరిజన రైతులు సుయారు 2 వేల ఎకరాల్లో జీడిమామిడి పంటలను పండిస్తున్నారు. ప్రతిఏటా ఆరువేల టన్నులు వరకు జీడిమామిడి పిక్కల దిగుబడి వస్తుంది. సగటున 160 కిలోల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిరిజన ప్రాతంలో పండించే జీడి పిక్కలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. గిరిజన ప్రాంతంలో సేకరించే జీడిమామిడి పప్పు బయట పప్పుకంటే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే ఇక్కడి పప్పు కొనుగోలు చేసేందుకు బయట వ్యాపారులు ఎగబడతారు.
ఎక్కడా కనిపించని కొనుగోలు కేంద్రాలు
గిరిజనులు పండించిన జీడిమామిడి పంట అమ్మకోవడానికి ఈ ప్రాంతంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో దళారులే గ్రామస్థాయిలో విక్రయాలు చేస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.170కి వ్యాపారులు జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేశారు. తర్వాత కిలో రూ.150 నుంచి ప్రస్తుతం కిలో రూ. 140 కి కొనుగోలు చేస్తున్నట్లు గిరిజన రైతులు చెబుతున్నారు. దీని వల తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బయట నుంచి వచ్చిన వ్యాపారులు సిడికెట్‌గా ఏర్పడి ధరను పతనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గిట్టుబాటు ధర కోసం రైతుల విజ్ఞప్తి
గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉద్యాన తోటలో జీడిమామిడి పంటల సాగు చేస్తుంటారు. ఐటీడీఏ ద్వారా ఉద్యానవన శాఖ పంటల సాగుకు ప్రోత్సహిస్తుంది. అయితే గిరిజనులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో మాత్రం పట్టించుకునే నాథుడే లేరని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్ముకోవడానికి కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అలాగే తాము పండించిన పంటకు క్వింటాకు రూ.20 వేలు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
గిరిజన ప్రాంతంలో గిరిజనలు ప్రతిసీజన్‌లో జీడిమామిడి పంటను అమ్ముకోవడాకి కొనుగోలు కేంద్రా ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. ప్రభుత్వం, అధికారులు కనీసం పట్టించుకోకపోడం వల్ల గిరిజనులు దళారు చేతిలో మోసపోతున్నారు. ఐటీడీఏ అధికారులు పట్టించుకుని కనీసం జీసీసీ ద్వార నైనా జీడిపిక్కలను కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలి.
– కారం రాఘవ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు, అలివేరు


