గణపవరం: గణపవరం మండలం ఎస్. కొండేపాడు గ్రామంలో రెండు రోజుల క్రితం కలుషిత మైదాపిండితో వేసిన బజ్జీలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను శుక్రవారం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు పరామర్శించారు. భీమవరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాఽధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాధితులంతా పూర్తిగా కోలుకునే వరకూ వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వాసుబాబు వెంట గణపవరం ఎంపీపీ అర్థవరం రాము, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ దండు రాము, వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు కొట్టు నరేష్, కొండేపాడు మాజీ సర్పంచ్ తోట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ కొండేపాడు గ్రామ అధ్యక్షుడు గంగుమోలు సూరిబాబు తదితరులు ఉన్నారు.
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో యడ్లబ బజారు, రామయ్యహాలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డుల్లో పొగ వస్తుందని ఫిర్యాదులు రావడంతో ఏలూరు పర్యావరణ శాఖ ఇంజనీర్ రామచంద్రమూర్తి విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఎన్విరాన్‌మెంట్ బోర్డుకు వచ్చిన ఫిర్యాదు మేరకు డంపింగ్ యార్డుకు తనిఖీ చేస్తున్నామన్నారు. మునిసిపల్ అధికారులకు నోటీసు జారీ చేసి నివేదిక కోరతామన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలో ఉన్న రెండు డంపింగ్ యార్డుల్లో నిత్యం పొగ వస్తుందని చుట్టూ ఇళ్లు, ఆలయాలు ఉన్నాయని స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పలు సమస్యలను తెలియజేస్తూ నేరుగా ఎన్విరాన్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బి.విజయసారథి, పబ్లిక్ హెల్త్ డీఈ విజయ్‌కుమార్, మునిసిపల్ డీఈ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు : మండలంలోని బాదంపూడిలో ఉండ్రాజవరపు గంగ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడు తాడేపల్లిగూడేనికి చెందిన బొగత శివకు ఏడాది జైలు, 2వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్ కె.లలిత తీర్పు శుక్రవారం వెలువరించినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. 6–7–2025న ఉండ్రాజవరపు గంగ వరంగల్ వెళ్లగా ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి తాళాలు బద్దలు కొట్టి బీరువాలో బంగారపు మంగళ సూత్రాలు 4 గ్రామలు, బంగారు కాయిన్ 2 గ్రాములు, ఒక వెండి గ్లాసును శివ దొంగలించాడు. దీంతో ఎస్సై సూర్యభగవానన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హజరపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు.


