చిరు వ్యాపారులను ఆదుకోవాలి
ఆకివీడు: అమెరికా–ఇరాన్ యుద్ధ సెగలు సామాన్యుడి వంటింటిని తాకాయి. గ్యాస్ కొరత ప్రచారాలతో సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. ముఖ్యంగా వివాహాది శుభకార్యక్రమాలకు గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. గ్యాస్ వినియోగంలో వాణిజ్య అవసరాలు అధికంగా ఉన్నప్పటికీ వాణిజ్య సిలిండర్లు సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. గత ఐదు రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయండంతో కాఫీ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ వంటి చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు మూతపడ్డాయి.
కట్టెల కోసం పరుగులు
గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్ల వ్యాపారస్తులు కట్టెల కోసం పరుగులు తీస్తున్నారు. కట్టెల పొయ్యిలతో బిర్యానీలు తయారు చేసి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పుల్లల ధరలు కూడా పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ఫంక్షన్లుకు అవసరమయ్యే గ్యాస్ లభించే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఓటీపీతో అక్రమార్కులకు కళ్లెం
గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారుడికి 24 గంటల్లో గ్యాస్ సరఫరా చేసే విధంగా ఓటీపీ విధానాన్ని గ్యాస్ కంపెనీలు తీసుకువచ్చాయి. దీంతో అక్రమ వ్యాపారానికి కళ్లెం వేసినట్లు అయ్యింది. గ్యాస్ సిలిండర్ల అక్రమ అమ్మకాలపై కూడా గట్టి నిఽఘా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సిలిండర్లను గ్యాస్ ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో వినియోగదారులు తొందరపడుతున్నారు. దీంతో గృహావసరాల బుకింగ్‌కు ఓటీపీ అమలుజేసి, 45 రోజుల వ్యవధి ప్రకటించారు. దీనివల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. వ్యాపారస్తులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలంటున్నారు.
చిరువ్యాపారులకు వారానికి ఒక వాణిజ్య గ్యాస్ బండ సరఫరా చేయాలి. కట్టెల పొయ్యిలతో బిర్యానీ పాయింట్ నడుపుకుంటున్నాం. గ్యాస్ ఇబ్బందులతో తినుబండారాలు, టీ స్టాల్స్, బిర్యానీ పాయింట్లు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే, ఉపాఽధి కోల్పోయి వీధిన పడాల్సి వస్తుంది.
– భీమవరపు ఆలామ్, బిర్యానీ పాయింట్, ఆకివీడు
రోజు రోజుకూ పెరుగుతున్న గ్యాస్ గుబులు
జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేత
చిరు వ్యాపారుల విలవిల


