ఏలూరు టౌన్ : స్థానిక పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల సమయంలో గొర్రెల మందపైకి ఒక డీసీఎం లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గొర్రెలమంద కాపరి తీవ్ర గాయాలపాలై విజయవాడ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల ప్రకారం కృష్ణాజిల్లా, ఏలూరు జిల్లా ఉంగుటూరు ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెల మందను మేపుకుంటూ ఏలూరు శివారు పాలగూడెం చేరుకున్నారు. అనంతరం వారంతా కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతానికి వెళ్లేందుకు ఏలూరు వైపు వస్తున్నారు. గొర్రెలతో ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకునేసరికి రాజమండ్రి వైపు నుంచి ఏలూరు నగరంలోకి వస్తోన్న డీసీఎం లారీ అధిక వేగంతో వస్తూ గొర్రెల మీద నుంచి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో గొర్రెలు కాచే బి.నరసింహకు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని విజయవాడ తరలించారు. ప్రస్తుతం విజయవాడలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఐదు గొర్రెల మృత్యువాతపడగా, మరో 10 గొర్రెలకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
5 గొర్రెలు మృతి, కాపరికి తీవ్ర గాయాలు


