వసతి సౌకర్య పథకానికి రూ.10 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలోని వసతి సౌకర్య పథకానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు టీయూ భాస్కరరావు గురువారం రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. శ్రీ ధర్మ అప్పారాయ నిలయంలోని డీలక్స్ ఏసీ గదికి ఈ విరాళాన్ని అందించారు. ముందుగా దాత కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓ వై.భద్రాజీకి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
పాలకోడేరు: మండలంలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జడ్డు లీలా శ్రీధర్, జ్ఞానదీపిక దంపతులు గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆ దంపతులు తమ కుమారులు విరాట్, నందన్‌లతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం అనంతరం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు ఈ విరాళాన్ని అందజేశారు. లీలాశ్రీధర్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన తల్లిదండ్రులు జడ్డు నాగేశ్వరరావు, శేషకుమారి ప్రోత్సాహంతో శ్రీవారికి విరాళం సమర్పించినట్లు శ్రీధర్ తెలిపారు.
బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మండలంలోని ఇప్పలపాడు పెట్రోల్‌బంక్ సమీపంలో చెట్టును ఢీకొని మృతి చెందాడు. నందాపురంనకు చెందిన గొర్రెముచ్చు సతీష్ ద్విచక్ర వాహనంపై రెడ్డిగణపవరం నుంచి తన స్వగ్రామం నందాపురం వెళ్తుండగా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
పెనుగొండ: ఆచంట వేమవరం శివారు నెహ్రూ నగర్ వద్ద పంట కాలువలో గురువారం మృతదేహం లభ్యమైంది. పొలం పనులకు వెళుతున్న రైతులు పంటకాలువలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆచంట ఎస్సై కే వెంకట రమణ ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, మృతుడు అత్తిలి గ్రామానికి చెందిన మానేపల్లి నాగేశ్వరరావు (32)గా గుర్తించారు, కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో తిరుగుతూ వచ్చి, ఆచంట వేమవరంలోని కల్వర్టుపై పడుకొని నిద్రపోయాడని, నిద్ర మత్తులో పంటకాలువలోకి జారి పడి ఊపిరాడక మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు మృతుడి పెదనాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఆటోలోంచి పడి గాయాలు పాలయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. ద్వారకాతిరుమలకు చెందిన పీఎంపీ వైద్యుడు నటరాజు కుమారుడు కె.యువరాజ్ 9వ తరగతి చదువుతున్నాడు. తూర్పువీధిలోని ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి గురువారం సాయంత్రం తిరిగి ఆటోలో ఇంటికి వెళుతుండగా స్థానిక కొత్త బస్టాండ్ దాటిన తరువాత మాంసం దుకాణాల వద్ద ప్రమాదవశాత్తు ఆటోలోంచి జారి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన బాలుడిని స్థానికులు హుటాహుటీన పీహెచ్‌సీకి తరలించి, చికిత్స అందించారు.
వసతి సౌకర్య పథకానికి రూ.10 లక్షల విరాళం
వసతి సౌకర్య పథకానికి రూ.10 లక్షల విరాళం
వసతి సౌకర్య పథకానికి రూ.10 లక్షల విరాళం


