సుందరగిరిపై కల్యాణోత్సవాలు ప్రారంభం
● పెండ్లికొడుకై న నారసింహుడు
● స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల : శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్.జగన్నాధపురం సుందరగిరిపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పెండ్లి కుమారుడయ్యారు. స్మార్త ఆగమయుక్తంగా పాంచాహ్నిక దీక్షతో వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కనకవల్లీ, లక్ష్మీ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలయ్యారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పండితులు నారసింహుడిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేశారు. వేడుకలో పాల్గొన్న ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం గర్భాలయంలో విశేష అలంకారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. సాయంత్రం ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, రుత్విగ్వరణ, అంకురార్పణ, కలశస్థాపన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్టాపన వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను, అలాగే అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఉత్సవాల్లో నేడు :
● ఉదయం 8 గంటల నుంచి నిత్య పూజలు, హోమము, బలిహరణ
● సాయంత్రం 6 గంటల నుంచి నిత్య పూజలు, హోమములు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు
● సాంస్కృతిక కార్యక్రమం : రాత్రి 7 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు


