పోస్టాఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (టూటౌన్) : ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పోస్టాఫీస్ పొదుపు, జీవిత బీమా పథకాలను ఉద్యోగులంతా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత పిలుపునిచ్చారు. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ గల తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ఆవశ్యకతపై భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు డివిజన్ల తపాలా సిబ్బందితో గురువారం ఏలూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు తపాలా సూపరింటెండెంట్ ఎస్.విజయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు తమ సమీప పోస్టాఫీస్‌లను సందర్శించి వివిధ పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 18, 19, 20వ తేదీల్లో జరుగు మెగా తపాలా జీవిత బీమా డ్రైవ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రెవెన్యూ లక్ష్యాలను సాధించిన ప్రతిభావంతులైన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భీమవరం డివిజన్ సీనియర్ తపాలా సూపరింటెండెంట్ కె.హరికృష్ణ ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఏవీ సరేష్ కుమార్, తాడేపల్లిగూడెం సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు, మూడు డివిజన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత


