కొల్లేరు సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్నదెవరు?
ఏలూరు (టూటౌన్): కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి అడ్డుపడుతున్నది ఎవరని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సూటిగా ప్రశ్నించారు. కొల్లేరు సమస్యపై కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పత్రికా ముఖంగా చేసిన వ్యాఖ్యలపై గురువారం నిర్వహించిన సమావేశంలో రవి మాట్లాడారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కల్లబొల్లి మాటలు చెప్పడం కాదని, మొసలి కన్నీరు కార్చడం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి ప్రభుత్వమేనని కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారానికి అడ్డు చెప్పేవారు ఎవరూ లేరని, చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో కొల్లేరు ప్రజలే భవిష్యత్తులో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 120 జీవోను రద్దు చేయాలని, కొల్లేరును 3వ కాంటూర్‌కు కుదించాలని, ఆ పరిధిలోనే అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని, పక్షులను పరిరక్షించాలని, 3వ కాంటూర్ కు వెలుపల ఉన్న ప్రభుత్వ భూములు, పట్టా భూములు కొల్లేరు ప్రజలు సాగు చేసేందుకు అవకాశం కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొల్లేరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు ప్రజల తరఫున సీపీఎం నిరంతరం పోరాటాలు సాగిస్తుందని ఎ.రవి స్పష్టం చేశారు.
ముదినేపల్లి రూరల్: పాల కేంద్రంలో చోరీ జరిగిన ఘటన ముదినేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పరసా సాంబశివరావు సెంటర్‌లో పాలపర్తి జగన్మోహనరావు దుకాణాల్లో పాల కేంద్రం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి వ్యాన్‌లో వచ్చిన పాల లోడ్‌ను దుకాణంలో దించుకుని, రూ.20 వేల నగదును కౌంటర్‌లో పెట్టి ఇంటికి వెళ్లాడు. తిరిగి ఉదయం వచ్చి చూసేసరికి కౌంటర్ పగలుగొట్టి ఉండడం నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెడ్‌కానిస్టేబుల్ టి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.


