పంట కాలువలో ఆక్వా వ్యర్థాల విడుదల
ఉండి: పంట కాలువలోకి ఆక్వా వ్యర్థాలు విడుదల చేయడంతో పంట కాలువ కలుషితమవుతోంది. దీంతో సాగు, తాగునీరు కలుషితమై ఇటు రైతులు, అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉండి శివారు ఉప్పుగుంట పంట కాలువలోకి ఓ ఆక్వా రైతు దర్జాగా ఆక్వా వ్యర్థాలను విడిచిపెట్టేశాడు. పెద్ద చెరువులో పట్టుబడి జరిగిన అనంతరం దానిలోని మొత్తం వ్యర్థాలను పంట కాలువలోకే విడిచిపెట్టేశారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు వాడుకునే నీరు కలుషితమైంది. సదరు రైతు చెరువుకు మాత్రమే కాకుండా వేలాది ఎకరాల్లో చెరువులకు ఇన్‌లెట్ సౌకర్యం మాత్రమే ఉండి అవుట్‌లెట్ సౌకర్యం లేకపోవడం గమనార్హం. కాసులకు కక్కుర్తిపడిన అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచి ఎడాపెడా ఆక్వా చెరువులకు అనుమతులు ఇవ్వడం దీనికి ప్రధాన కారణం. ఆక్వా చెరువుకు అనుమతివ్వాలంటూ ప్రాథమికంగా పరిశీలించాల్సి ఉంది. సాగునీరు చెరువుకు అందుతుదా లేదా అని, అలాగే చెరువులోని మురుగునీరు డ్రెయిన్‌లోకి వెళ్లే సదుపాయం ఉందా లేదా అని చూడాలి. కానీ ఒక్క మండలమే కాకుండా నియోజకవర్గంలోని వేలాది ఎకరాల ఆక్వా చెరువులకు ఇదే సమస్య ఉంది. దీనివల్లనే చెరువుల పట్టుబడి జరిగిన అనంతరం దానిలో విషపూరితమైన వ్యర్థాలను నేరుగా పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీంతో నీటిని కనీస అవసరాలకు తాగునీటికి వినియోగించిన ప్రజలు అంతుచిక్కని రోగాలతో ప్రాఽణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కేన్సర్ వ్యాధి ఎక్కువగా ప్రబలేందుకు ఆక్వా వ్యర్థాలు కూడా ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఇంతటి ప్రాణాపాయం ప్రజలకు సంభవిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


