జగనన్న క్రీడలను ప్రోత్సహించారు
తణుకు అర్బన్: సంక్రాంతి పండుగలో యువత జూద క్రీడల జోలికి పోకండా జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి క్రీడలపైపు మళ్లించడం మంచి పరిణామమని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు జాతీయ రహదారి సమీపంలో నిర్వహిస్తున్న జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్‌ను గురువారం సునీల్‌కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యలమల నాగార్జునయాదవ్ సందర్శించారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. క్రీడా సామగ్రి ఉచితంగా ఇవ్వడంతోపాటు క్రీడాకారులకు అల్పాహారం, భోజన వసతి కల్పించి విజేతలకు నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించారన్నారు. ముఖ్యంగా జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్‌లో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి 40 జట్లు పాల్గొనడం విశేషమని, నిర్వాహకుడైన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ తణుకు పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గోపె ఎడ్వర్డ్ పాల్, రెండు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.


