మాటేసి.. మట్టుబెడుతూ..
కొనసాగుతున్న పులి దాడులు
కొయ్యలగూడెం: పెద్దపులి సంచారం ప్రజల్లో కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజులుగా మండలంలోని మర్రిగూడెం, బిల్లిమిల్లి గ్రామాల మధ్య సంచరిస్తున్న పెద్దపులి మూడో రోజు కూడా అదే ప్రాంతాల మధ్య తిష్ట వేసిందని అటవీ శాఖ అధికారులు సోమ వారం తెలిపారు. పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చుతూ దాని ఉనికిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రెండు గ్రామాల మధ్య ఉన్న మందపాటి చెరువులో పులి అడుగుజాడలు గుర్తించామన్నారు. కాగా రెండు రోజుల క్రితం దాడి చేసి చంపిన ఆవు, గేదల్లో ఆవును పెద్ద పులి ఆదివారం రాత్రి కొంతమేర ఈడ్చుకుపోయి తినేసిందన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం రీత్యా పెద్దపులిని వలల్లో బంధించడం లేదా పెద్దపులి తిరిగి అభయారణ్యంలోకి వెళ్లేలా చేయటమే తమ విధి అని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు పెద్దపులి బారి నుంచి ప్రజలను, పశువులను కాపాడడం మి నహా తాము చేయగలిగింది ఏమీ లేదని అన్నారు.


