
మావుళ్లమ్మను దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రముఖ ఇలవేల్పు మావుళ్ళమ్మ వారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్ టీం లో భీమవరం బుల్స్ టీంకు నితీష్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించాలని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేపు జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు
తణుకు అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు ఈనెల 3న తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాలుర, బాలికల విభాగాల్లో నిర్వహించనున్నామని, ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9 నుంచి 11 వరకు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని వివరించారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్ కార్డుతో ఉదయం 8 గంటలకు తణుకు క్రీడా ప్రాంగణంలో రిపోర్ట్ చేయాలని, ఇతర వివరాలకు 9989363978 నంబరులో సంప్రదించాలని కోరారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
మండవల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని భైరవపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన పండు జోజి పెద్ద కుమారుడు తరుణ్ అలియాస్ చందు (23) 31న ఒంటి గంట సమయంలో బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. శుక్రవారం ఇంటి పక్కనే ఉన్న చేపల చెరువులో జారిపడి మృతిచెందాడు. పోలీసు సిబ్బంది కేసు నమోదు చేశారు.
రోడ్ల ఆక్రమణలపై చర్యలు
కొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ అంతర్గత రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నట్లు కార్యదర్శి కే.సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. జూలై 29 సాక్షిలో ప్రచురితమైన అంతర్గత రోడ్ల ఆక్రమణ విషయంపై ప్రజలతో మాట్లాడుతూ స్వమిత్వ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేసుకోవచ్చనని సూచించారు. సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ చేసి ఆక్రమణలను గుర్తించామని వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా స్వమిత్వ ద్వారా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.

మావుళ్లమ్మను దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్