
మైన్స్ అధికారులంటూ వసూళ్లు
సాక్షి, భీమవరం : మైన్స్ అధికారులుగా చెప్పుకుంటూ జిల్లాలో వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరి వ్యక్తులపై గురువారం లారీ యూనియన్ నేతలు ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైన్స్ అధికారుల ముసుగులో ఇద్ద రు వ్యక్తులు రెండు రోజులుగా సిద్ధాంతం, పెరవలి, తణుకు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కారులో సంచరిస్తున్నారు. లారీలను ఆపి రికార్డులు చూపించమని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పెనాల్టీల పేరిట వసూళ్లు చేసిన సొమ్ములకు రసీదులు కూడా ఇవ్వడం లేదు. గురువారం సిద్ధాంతం సమీపంలో లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఏలూరులోని గనులు, భూగర్భశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు రాజా చెప్పారు. మైన్స్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రెండు రోజులుగా అందుబాటులో లేకుండా తిరుగుతున్నారని, వారు అయి ఉండవచ్చునని అధికారులు అభిప్రాయపడినట్టు రాజా తెలిపారు. ఈ విషయమై మైన్స్ పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి ఏడీని ఫోన్‌లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భీమవరంలో అలంకారప్రాయంగా ఆఫీస్
భీమవరంలో గనులు, భూగర్భశాఖ జిల్లా కార్యా లయం అలంకారప్రాయంగా మిగిలింది. కార్యాలయ సూపరింటెండెంట్ లాంగ్ లీవ్‌పై వెళ్లిపోగా, సర్వేయర్ డిప్యూటేషన్‌పై ఏలూరులో పనిచేస్తు న్నారు. ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఏజీ), ఒక రా యల్టీ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఏఓ), రెండు ఆఫీస్ సబార్డినేట్, చైన్‌మెన్, డ్రైవర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఇసుక ర్యాంపులు సీఆర్‌జెడ్ పరిధిలోకి వెళ్లి మైనింగ్ నిలిచిపోవడంతో ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఏలూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నారు.
పర్యవేక్షణ కరువు
జిల్లాలో మైనింగ్ లీజులు లేనప్పటికీ పట్టించుకునే వారు లేక ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లోని గోదావరి తీరంలో బొండు, ఇసుక, అలాగే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంబడి ఇసుక, తాడేపల్లిగూడెం రూరల్‌లోని ఆరుగొలనులో గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లారీలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు
ఉన్నతాధికారులకు లారీ యూనియన్ నేతల ఫిర్యాదు